వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం: బోళ్ళ వెంకట రమణ

రాజోలు, ఆగస్టు 10: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ విమర్శించారు. గోదావరి వరద తీవ్రతను ముందుగా అంచనా వేయడంలో వైఫల్యం వల్ల లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయలేక పోయారని అన్నారు. రాజోలులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరద తాకిడితో లంక గ్రామాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కోనసీమలో అప్పనపల్లి, ముక్తేశ్వరం, కనకాయలంకల వద్ద కాజ్ వేలపై వరద ఉధృతి అధికంగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కాజ్ వేల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోనందున అప్పనపల్లి కాజ్ వే వద్ద ఇద్దరు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వరద కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వెంకట రమణ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *