Telangana, Harish Rao, Corona Virus, PA corona virus

స్వీయ గృహ నిర్బంధంలోకి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన వార్త తెలిసిన మర్నాడే సిద్ధిపేటలోని మంత్రి పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు.

అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tags: Telangana, Harish Rao, Corona Virus, PA corona virus

Telangana, Hyderabad, Corona Virus, Police 

హైదరాబాద్‌లో కరోనా బారిన పడిన సీఐ, ఎస్సై,కానిస్టేబుల్!

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తుండగా మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా కరోనా రోగులుగా మారుతుండడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా పరీక్షలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను సొంత రాష్ట్రానికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కంటైన్‌మెంట్ జోన్లలోనూ ఆయన విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఎక్కడో ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.

సీఐకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు కలిపి మొత్తం 30 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో కొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన పోలీసుల కుటుంబాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులు కరోనా బారినపడుతుండడంతో ఆ శాఖలో కలకలం రేగింది. చాలామంది పోలీసులు లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
Tags: Telangana, Hyderabad, Corona Virus, Police

New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగే రైళ్ల వివరాలు!

సుమారు 50 రోజుల తరువాత రేపటి నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసిన రైల్వే శాఖ, బుకింగ్ కౌంటర్స్ వద్ద టికెట్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.

హౌరా – న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ – న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – జమ్మూతావి, బెంగళూరు – న్యూఢిల్లీ, తిరువనంతపురం – న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ, బిలాస్ పూర్ – న్యూఢిల్లీ, రాంచీ – న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ – న్యూఢిల్లీ, అగర్తలా – న్యూఢిల్లీ, భువనేశ్వర్ – న్యూఢిల్లీ, మడ్ గావ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.

ఇక రేపటి నుంచి తిరిగే రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలను పరిశీలిస్తే…

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
Tags: New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

Telangana,Corona Virus,Positive Cases,Deaths,COVID-19

తెలంగాణలో ఇవాళ కొత్తగా 33 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి క్రమంగా ఊపందుకుంటోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొన్నిరోజుల పాటు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడంతో కట్టడి చర్యలు ఫలితాలనిస్తున్నాయని భావించారు. అయితే, గత కొన్నిరోజులుగా నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతుండడం, అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. ఏడుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఇక, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి పెరిగింది. ఇవాళ ఎవరూ డిశ్చార్చి కాలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారు.

Uttam Kumar Reddy, Congress, Telangana, Corona Virus

ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొనాలి.. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తుండడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయడంలేదని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తక్కువ పరీక్షలు చేయడం, తక్కువ కేసులు చూపెట్టడం ప్రజలను ఫూల్స్ చేయడమేనని కోర్టు చెప్పింది. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొనాలి. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలి’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ట్వీట్ చేశారు.

కరోనా పరీక్షలను తగినంత మేరకు ఎందుకు జరపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించిందంటూ వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని చెప్పడం సరైన విధానమేనా? అని నిలదీసిందని అందులో ఉంది.
Tags: Uttam Kumar Reddy, Congress, Telangana, Corona Virus

Telangana,Wines,KCR,Reopen

నాకు ఇష్టం లేదు… అయినా తప్పడం లేదు: మద్యం షాపుల ప్రారంభంపై కారణం చెప్పిన కేసీఆర్

రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే మద్యం షాపులను తిరిగి ప్రారంభించడం తనకు ఇష్టం లేదని, అయినా తప్పడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయాల మేరకు సోమవారం నుంచి తెలంగాణకు సరిహద్దులను కలిగివున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్ తో 890 కిలోమీటర్లు, మహారాష్ట్రతో సుమారు 700 కిలోమీటర్లు, కర్ణాటకతో 496 కిలోమీటర్లు, చత్తీస్ గఢ్ తో 235 కిలోమీటర్ల బార్డర్ ఉందని అన్నారు. ఈ సమయంలో తెలంగాణలో షాపులను తెరవకుంటే, లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోతుందని, సరిహద్దు గ్రామాల ప్రజలు నిన్న, ఇవాళే హద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారని, ఈ కారణంతో కరోనా వైరస్ మహమ్మారి తిరిగి వ్యాపించకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో మద్యం తయారు చేసే డిస్టిలరీల నుంచి కూడా ఒత్తిడి పెరిగిందని, దేశమంతా దుకాణాలు తెరిచి, మద్యం తయారీ కేంద్రాలు నడుస్తుంటే, తెలంగాణలో తాము నష్టపోతామని, తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడేసరికి రాష్ట్రంలో గుడుంబా రాజ్యమేలుతోందని, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఎంతో శ్రమించి, తెలంగాణ రాష్ట్రాన్ని గుండుంబా రహితంగా మార్చేందుకు కృషి చేశారని తెలిపారు. గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయాలను చూపించి, వారిని మార్చామని, కానీ గత 45 రోజులుగా గుడుంబా తయారీ కేంద్రాలు వెలిశాయని, తిరిగి రాష్ట్రంలో గుడుంబా కనిపించకుండా చేస్తామని తెలిపారు. వైన్స్ షాపులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరచేవుంటాయని, కస్టమర్లు హడావుడి లేకుండా కొనుక్కోవచ్చని సూచించారు.
Tags: Telangana,Wines,KCR,Reopen

KCR,Lockdown,Telangana,Corona Virus

ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాం: సీఎం కేసీఆర్

తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు ఏడు గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుందని అన్నారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు.
Tags: KCR,Lockdown,Telangana,Corona Virus

Andhra Pradesh, Telangana, Border, Vehicles, Stop

తెలంగాణ వాహనాలను అడ్డుకున్న ఏపీ, ఏపీ వాహనాలను అడ్డుకున్న తెలంగాణ… రోడ్లపై వేలాది మంది!

అధికారుల మధ్య సమన్వయ లోపం, వేలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డుపై నిలిపింది. లాక్ డౌన్ నుంచి సడలింపులు రావడం, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు, స్వస్థలాలకు వెళ్లేందుకు పరిమితులతో కూడిన అనుమతులు రావడంతో భారీ సంఖ్యలో ప్రజలు రాష్ట్రాలు దాటేందుకు సరిహద్దులకు చేరుకున్న వేళ, అధికారులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళుతున్న వారిని ఏపీ పోలీసులు అడ్డుకోగా, ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద రాష్ట్రాలు దాటేందుకు పాస్ లు ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా రోడ్లపైనే నిలిపివేశారు.

దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా కర్నూలు, నాగార్జున సాగర్, కోదాడ తదితర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో చిక్కుకుని పోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి బయలుదేరిన వారంతా, ఈ ఉదయం వరకూ సరిహద్దుల వద్దే ఉండిపోయారు. దీంతో సరిహద్దుల వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకుని, తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు డిమాండ్ చేశారు.
Tags: Andhra Pradesh, Telangana, Border, Vehicles, Stop

Corona Virus,Telangana,Red Zone,Orange Zone,Notify

తెలంగాణలో ప్రస్తుతమున్న రెడ్, ఆరంజ్ జోన్లు ఇవే!

కరోనా కేసులు నమోదవుతున్న స్థాయిని బట్టి, రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించిన అధికారులు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్రం, రాష్ట్రంలోని రెజ్ జోన్లను, ఆరంజ్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో రెండు వారాల క్రితం గుర్తించిన 170 హాట్ స్పాట్స్ సంఖ్యను 129కి తగ్గించింది.

తెలంగాణలోని రెడ్‌ జోన్ల విషయానికి వస్తే, హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌, వరంగల్‌ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆరంజ్ జోన్ల సంఖ్య 18కి పెరిగింది. వాటి వివరాలు పరిశీలిస్తే, నిజామాబాద్, జోగులాంబ, నిర్మల్‌, నల్గొండ, అదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసీఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, నారాయణపేట, మంచిర్యాల ప్రాంతాలున్నాయి. ఇదే సమయంలో మిగతా తొమ్మిది జిల్లాలైన పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి గ్రీన్ జోన్లుగా కేంద్రం గుర్తించింది.
Tags: Corona Virus,Telangana,Red Zone,Orange Zone,Notify