ఐక్యతతో చిన్న పత్రికల సమస్యల పరిష్కారం ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిల్లీబాబు రెడ్డి

విజయవాడ, ఆగస్టు 5: చిన్న, మధ్యతరహా పత్రికలు తమ సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో పయనించాలంటే ఐకమత్యంతో పని చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాడు విజయవాడ పటమటలోని ఎపిఎంఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖ సమాచారం సంపాదకులు ఎస్. వీరభద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిల్లీబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పత్రికలకు ప్రకటనల మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఎపిఎంఎఫ్ పని చేస్తోందని, ఇప్పుడు ఎపిఎంఎఫ్ కు అనుబంధంగా ఏర్పడిన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పటిష్టతకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.

రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్. ఎన్.ఐ), డిఎవిపి, డిఐపిఆర్ తదితర ప్రభుత్వ సంస్థల నుండి చిన్న పత్రికలకు అవసరమైన సమాచారం, సహకారం అందించేందుకు అసోసియేషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. నిబద్ధతతో, నిజాయితీతో, క్రమశిక్షణతో చిన్న పత్రికల సంపాదకులు పని చేస్తే అనుకున్న లక్ష్యాలు సునాయాసంగా సాధించవచ్చునని ఆయన తెలిపారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన అసోసియేషన్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన చిన్న పత్రికల సంఘాల నాయకులు వారి స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన చిన్న పత్రికలకు న్యాయం జరగలేదని అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికల సంపాదకులు, ప్రచురణకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఐకమత్యంతో పని చేసేందుకు ఎపిఎంఎఫ్ కు అనుబంధంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో ముఖ్యఅతిథి, లీడర్ దినపత్రిక సంపాదకులు వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రకటనల సహకారం లేకుండానే చైతన్యవంతమైన వార్తలు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావటం ద్వారా లీడర్ పత్రికను విజయవంతంగా నిర్వహిస్తున్న తీరును వివరించారు.

చిన్న పత్రికల మధ్య ఐక్యత కోసం ఎపిఎంఎఫ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి బి. సతీష్ బాబు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు నిర్వహించి అక్టోబర్ నెలలో మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి హాజరైన సంపాదకులు గిరిబాబు, సత్యన్న, పడాల వీరభద్రరావు, బాబ్జాన్ తదితరులు ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *