హైదరాబాద్ లో యువతి కిడ్నాప్, ఆపై పోలీసుల చేజింగ్… సినీ పక్కీలో హైడ్రామా!

హైదరాబాద్ శివార్లలో ఓ యువతి కిడ్నాప్, ఆపై జరిగిన హైడ్రామా, పోలీసుల చేజింగ్ కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై నిందితులపై నిర్భయ సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడ వెళ్లాలని హయత్ నగర్ సమీపంలోని ఓ బస్టాపులో నిలుచున్న యువతిని, అదే దారిలో కారులో వెళుతున్న ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి, విజయవాడలో దింపుతామని నమ్మించి ఎక్కించుకున్నారు. ఆపై కారు చౌటుప్పల్ వరకు వెళ్లేసరికి, వారి నుంచి వేధింపులను ఎదుర్కొన్న ఆమె కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు కొందరు కారును వెంబడించారు. ఈ విషయాన్ని గమనించిన నిందితులు సదరు యువతిని రోడ్డుపై వదిలి పరారుకాగా, విషయం పోలీసులకు చేరింది. వారిని పట్టుకునేందుకు పోలీసు వాహనాలు రోడ్డెక్కాయి. ఆపై 30 కిలోమీటర్లకు పైగా చేజింగ్ సాగగా, నార్కట్ పల్లి సమీపంలో వీరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.