‘హాయ్ ఫిజిక్స్’ అంటూ జలీల్ ఖాన్ ను పలకరించిన రోజా!

బీకాంలో ఫిజిక్స్ చేయాలనుకున్నానంటూ చెప్పి అపఖ్యాతితో పాటు, ఫుల్ పాప్యులారిటీని కూడా సంపాదించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ఈ నేపథ్యంలో, అమరావతిలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్ ను ఆటపట్టించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీలోకి జలీల్ ఖాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ నవ్వులు పూశాయి.

‘ఫిజిక్స్ ఎలా ఉందన్నా’ అంటూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతలోనే అక్కడకు వచ్చిన రోజా.. ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. ఈలోగా వైసీపీ మహిళా ఎమ్మెల్యేలంతా అక్కడకు వచ్చారు. ‘మేము నానా హంగామా చేసినా, మాపై పోలీసులు కేసు పెట్టినా… మీకు వచ్చినంత పాప్యులారిటీ మాకు రాలేదు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన మీకు ఇక్కడే కాదు… ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది’ అంటూ నవ్వులు పూయించారు. దీనిపై జలీల్ ఖాన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. అందరిలా మనం కూడా సరిగ్గా చెబితే మనల్ని ఎవరూ గుర్తించరని… ఉల్టాగా చెబితేనే మన గురించి అందరూ చర్చించుకుంటారని అన్నారు. మరోవైపు శాసనసభలో వైసీపీ అధినేత జగన్ కూడా… కామర్స్ లో ఫిజిక్స్ చదివిన వారికి తన లెక్కలు అర్థం కావని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.