సులువుగా సిమ్‌-ఆధార్‌ అనుసంధానం

వయోధికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా – చరవాణి సిమ్‌(కనెక్షన్‌)లతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియలో ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆధార్‌ను అనుసంధానించాలంటే ప్రస్తుతం ఆయా టెలికాం సంస్థల సేవాకేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. అయితే వయోధికులు ఆ కేంద్రాలకు వెళ్లనవసరం లేకుండా ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈదిశగా టెలికాం సంస్థలతో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ప్రాథమికంగా ఇవన్నీ వయోధికులనుద్దేశించినవే అయినా – గ్రామీణ, కొండ ప్రాంతాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో నివసించేవారికి టెలికాం సేవాకేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయాలను ఇతరులకూ వర్తింపజేసే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

పరిశీలనలోని అంశాలు..
* అంతర్జాలంలో ఏకకాల సంకేత పదం(ఓటీపీ) ద్వారా యూఐడీఏఐతో నమోదు చేసుకోవడం. అయితే ఆధార్‌ నమోదు సమయంలోనే ఆ చరవాణి సంఖ్యను ఇచ్చిఉంటే ఈ ప్రక్రియ మరింత సులువవుతుంది.
* వయోధికుల ఇళ్లకే టెలికాం సంస్థలు తమ ప్రతినిధులను పంపించి ఆధార్‌ నమోదు చేయడం, బయోమెట్రిక్‌ వివరాలను తీసుకోవడం. అంతర్జాలంతో అనుసంధానించే చిన్న పరికరంతో ఈ వివరాలను సేకరించవచ్చు.
* వృద్ధులెవరైనా బయటకు కదల్లేని స్థితిలో ఉంటే అలాంటి వారు తమ కుటుంబంలో ఒకరిని తమ ప్రతినిధిగా ఏర్పాటు చేసుకుని ఆధార్‌ అనుసంధానికి పంపించడం.