రంగస్థలం మొనగాడు

ఇప్పటి హీరోయిజం స్టైల్‌ నుంచి పుడుతుంది. హీరో ఎంత స్టైల్‌ ఉంటే, అభిమానులకు అంత పండగ. స్టార్‌ హీరోలు స్టైలీష్‌గా కనిపించడానికే చూస్తున్నారు. అలాంటి సమయంలో రామ్‌చరణ్‌ ఓ విభిన్నమైన పాత్రని ఎంచుకొన్నాడు. ‘రంగస్థలం’ కోసం! ఈ సినిమాలో చరణ్‌ పల్లెటూరి పిల్లగాడిగా కనిపించబోతున్నాడు. గుబురుగా గడ్డం కూడా పెంచేశాడు. చరణ్‌ని ఈ లుక్‌లో చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. గళ్ల చొక్కా, లుంగీ, పైన కండువా… ‘రంగస్థలం’లో చరణ్‌ లుక్‌ ఇది. పైగా ఇందులో చరణ్‌ చెవిటివాడిగా కనిపిస్తున్నాడన్న కబురొకటి. ఇలా.. అన్నీ ప్రయోగాలే. కానీ ఇది మాత్రం పక్కా కమర్షియల్‌ సినిమా అట. ఆ విషయంలో మాత్రం చరణ్‌ అభిమానులు హ్యాపీ అయిపోవొచ్చు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయిక. సమంత పాత్ర కూడా సరికొత్తగా ఉండబోతోంది. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కావొచ్చింది. డిసెంబరులో తొలి కాపీ సిద్ధమైపోతోందని తెలుస్తోంది. సంక్రాంతికి ‘రంగస్థలం’ తీసుకొద్దామనుకొన్నారు. అయితే ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నట్టు సమాచారం. ఎందుకంటే సరిగ్గా సంక్రాంతికే బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. బాబాయ్‌ – అబ్బాయ్‌ల మధ్య పోటీ ఎందుకన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే.. ‘రంగస్థలం’ పోటీ నుంచి తప్పుకొందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పల్లెటూరి మొనగాడ్ని చూసేయొచ్చు.
* నాన్న కోసం
చరణ్‌ చేతిలో ఉన్న మరో బాధ్యత… ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి 150వ సినిమా కోసం అగ్ర నిర్మాతలంతా పోటీ పడుతున్న తరుణంలో ఆ అవకాశాన్ని తానే అందిపుచ్చుకొన్నాడు చరణ్‌. ‘ఖైది నెంబర్‌ 150’ని అభిమానుల అంచనాలకు అనుగుణంగా రూపొందించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు అదే భరోసాతో చిరు 151వ సినిమా బాధ్యతల్నీ తీసుకొన్నాడు. ‘సైరా’కి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. డిసెంబరులో ‘సైరా’ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ సమయంలో ‘రంగస్థలం’కి కాస్త బ్రేక్‌ ఇచ్చి, ‘సైరా’ పనుల్ని దగ్గరుండి చూసుకోబోతున్నాడు చరణ్‌. ‘‘నాన్న సినిమా అంటే అది గురుతర బాధ్యత కిందే లెక్క. అభిమానులు చాలా చాలా ఆశిస్తారు. వాళ్లని మెప్పించే బాధ్యత నాపై ఉంది. అందుకే ‘సైరా’పై ప్రత్యేక దృష్టి పెట్టా’’ అంటున్నాడు చరణ్‌.