మనమే మేటి

వృద్ధిరేటు… సంక్షేమంలో తెలంగాణకు సాటి లేదు
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ కార్యక్రమాల అమలు
బొందిలో ప్రాణమున్నంత వరకు రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతా
21.7శాతం వృద్ధిరేటుతో ముందంజలో తెలంగాణ
ఆదాయ వనరులు పెంచుకోవడంలో మనమే నంబర్‌వన్‌
అహోరాత్రులు శ్రమిస్తున్న అధికారులకు అభినందనలు
దేశానికే ఆదర్శంగా సిద్దిపేట జిల్లా తయారు కావాలి
కేసీఆర్‌ కిట్‌ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి
బతుకమ్మ చీరలపై అనవసర రాద్ధాంతం
సిద్దిపేట, సిరిసిల్ల సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

‘దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. చరిత్రలో ఎవరూ చేయని విధంగా పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాం. సొంత ఆదాయ వనరులను పెంచుకునే విషయంలో ముందున్నాం. 21.7 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. ఇది నేను చెప్పే లెక్క కాదు. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ చెప్పిన లెక్కలు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పరిపాలన విభాగాల్లో అహోరాత్రులు శ్రమిస్తున్న అధికారులకు అభినందనలు. వారి కృషి వల్ల అందరికీ మేలు చేకూరుతోంద’ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద నూతనంగా నిర్మించనున్న సమీకృత పాలనాధికారి కార్యాలయం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలకు, సిద్దిపేట అర్బన్‌ మండలంలోని ఎన్సాన్‌పల్లి గ్రామశివారులో నిర్మించనున్న వైద్యకళాశాల భవనాలకూ భూమిపూజ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం, అపెరల్‌ పార్క్‌, మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండు చోట్లా బహిరంగ సభల్లో మాట్లాడారు. తొలుత సిద్దిపేటలో ప్రసంగించారు. ‘నా బొందిలో ప్రాణమున్నంత వరకు తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతా. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రమూ చేయనంత సాహసంతో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చుకున్నాం. రూ.1,300 కోట్లు మంజూరు చేసుకొని కొత్త జిల్లాల్లో సమీకృత పాలనాధికారి కార్యాలయాలతో పాటు పోలీసు కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. కొన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ కూలిపోయే స్థితిలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నాం.