ప్రధాని విమానాన్ని కూడా దిగనివ్వం: బీజేపీ ఎమ్మెల్యే

రాజస్థాన్‌లోని కోట అంటే కోచింగ్ సెంటర్లకు బాగా ప్రసిద్ధి చెందినది. ఐఐటీ కోచింగ్ అంటే అక్కడే తీసుకోవాలంటారు. కానీ ఇన్నాళ్లుగా అక్కడ సరైన విమానాశ్రయం మాత్రం లేదు. ఈ అంశం మీద బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్ తీవ్రంగా మండిపడ్డారు. నగర పౌరుల కోసం విమానాల సేవలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రధానమంత్రి సహా ఏ వీవీఐపీ విమానాన్నీ ఇక్కడ దిగనిచ్చేది లేదని హెచ్చరించారు. పాస్‌పోర్ట్ సేవాకేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయనీ మాట చెప్పారు. కోట విమానాశ్రయంలో విమానాలు లేకపోతే పాస్‌పోర్టులు పెట్టుకుని జనం ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. కోట విమానాశ్రయం కేవలం వీవీఐపీలు, రాజకీయ నాయకుల కోసమే ఉన్నట్లుందని, ఇక్కడ కేవలం చిన్న విమానాలు మాత్రమే దిగుతాయని ఆయన అన్నారు.

కోట జిల్లాలోని లాడ్‌పురా నియోజకవర్గానికి రజావత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా రజావత్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవలే ఫిబ్రవరి 19వ తేదీన బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు గొడవ జరిగినప్పుడు.. తాను అక్కడ ఉంటే పోలీసుల పీక పిసికేసేవాడినని వ్యాఖ్యానించారు. చంబల్ నదిలో మొసళ్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉందని, వాటిని కాల్చి పారేయాలని చెప్పారు. హెల్మెట్లు ధరించడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు. ఇక్కడ కొత్త విమానాశ్రయం ఏర్పాటుచేయాలని, లేదా రన్‌వేను విస్తరించాలని, అప్పుడే పౌరులకు విమానాలు అందుబాటులోకి వస్తాయని రజావత్ అన్నారు.