పసిడికి ఫెడ్‌ దడ!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు గతవారం రూ.29,029 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో రూ.29,187 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. అయితే అమెరికా ఫెడ్‌ సమావేశానికి ముందు డాలరుకు గిరాకీ పెరగడంతో పసిడి కాంట్రాక్టు తీవ్ర ఒత్తిడికి లోనై, రూ.28,471కు దిగివచ్చింది. చివరకు 1.71% నష్టపోయి రూ.28,533 వద్ద స్థిరపడింది. జులై తరవాత కాంట్రాక్టుకు ఇదే కనిష్ఠ స్థాయి. ఈవారం అమెరికా ఫెడ్‌, ఐరోపా సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) సమావేశ నిర్ణయాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి. సాంకేతికంగా చూసినా పసిడి కాంట్రాక్టులో మరికొంత దిద్దుబాటు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈవారం కాంట్రాక్టు రూ.28,440 ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.28,273; ఆ తర్వాత రూ.28,014కి దిగిరావచ్చు. అప్పుడు దీర్ఘకాల ప్రాతిపదికన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. వెండి డిసెంబరు కాంట్రాక్టు గత వారం రూ.37,615 వద్ద మొదలైంది. ఆ తర్వాత రూ.36,872- 37,850 మధ్య చలించి, ఆఖరుకు 1.46% క్షీణతతో రూ.37,064 వద్ద ముగిసింది. ఈవారం కాంట్రాక్టుకు రూ.36,666 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయి దిగితే రూ.36,284కి దిగిరావచ్చు.