పట్టిసీమ చెంత… ప్రజాప్రతినిధుల పులకింత

పోలవరం సందర్శనలో 64 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఎప్పుడో స్కూల్లోనో, కాలేజీలోనో చదివే రోజుల్లో బస్సు వేసుకుని వినోద యాత్రకో, విజ్ఞాన యాత్రకో వెళ్లుంటారు..! మళ్లీ ఇన్నేళ్లకు వారికి అలాంటి అవకాశం వచ్చింది. చట్ట సభల సభ్యులు మరోసారి చిన్న నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ… గురువారం ఉదయం విజయవాడ నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో పోలవరం, పట్టిసీమ యాత్రకు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు శాసనసభ, శాసన మండలి సభ్యులు మొత్తం 64 మంది ఇందులో పాలుపంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దుగ్గిరాల దగ్గర, ఏలూరు ఎంపీ మాగంటి బాబు కొయ్యలగూడెంలో వీరికి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. బయల్దేరేటప్పుడే అల్పాహారం తీసుకున్నామని ప్రజా ప్రతినిధులు చెప్పినా… తమ ఆతిథ్యం తప్పక స్వీకరించాల్సిందేనని సాదరంగా ఆహ్వానించారు. హిందుపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి లోకేష్‌లు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రాయలసీమ నేతల్లో అమితానందం
ఈ పర్యటనలో రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమితానందభరితులయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల డెలివరీ పాయింట్‌ నుంచి పోలవరం కుడికాలువలోకి 24 పంపులు ద్వారా నీరు ప్రవహిస్తున్న తీరును చూసి పరవశులయ్యారు. కృష్ణా డెల్టాకు ఇక్కడి పట్టిసీమ జలాలు అందుబాటులోకి రావడంతో శ్రీశైలం నుంచి తమ రాయలసీమకు లబ్ధి కలుగుతోందని పేర్కొన్నారు. మంత్రి పరిటాల సునీత మరింత భావోద్వేగానికి గురయ్యారు.
నాన్నగారితో షూటింగ్‌కి వచ్చా: బాలకృష్ణ
శ్రీనివాస కల్యాణం, సీతారామ కల్యాణం సినిమాల కోసం తాను పట్టిసీమ ప్రాంతానికి వచ్చిన రోజుల్ని సినీ నటుడు బాలకృష్ణ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ‘‘శ్రీనివాస కల్యాణం షూటింగ్‌ కోసం నేను నాన్నగారు ఎన్టీఆర్‌తో కలసి ఇక్కడకి వచ్చా. ఆ సినిమాలో నారదుడిగా నటించా’’ అని అన్నారు. తాను హీరోగా నటించిన సీతారామకల్యాణం సినిమా చిత్రీకరణ నాటి జ్ఞాపకాల్ని ఆయన సహచర సభ్యులతో పంచుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెదేపా ప్రభుత్వం కేవలం సంవత్సర కాలంలో పూర్తిచేయడం నిజంగా రికార్డన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టుని చూసి తామంతా పో‘లవర్స్‌’గా మారిపోయామని మంత్రి కాలవ శ్రీనివాసులు చమత్కరించారు.

రాయలసీమకు ఊరట: మంత్రి లోకేష్‌
రాయలసీమ పంటల పరంగా అభివృద్ధి చెందడానికి పట్టిసీమ కారణమని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి నారా లోకేష్‌ అన్నారు. దీన్ని పూర్తి చేయడంలో సీఎంతోపాటు జలవనరుల మంత్రి దేవినేని ఉమా ఎంతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
స్పిల్‌వే నిర్మాణంపై ప్రశంసలు…
పట్టిసీమ ఎత్తిపోతల పథకం చూసిన అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. స్పిల్‌వే నిర్మాణ పనులు, హిల్‌వ్యూ కొండ నుంచి ఎర్త్‌కంర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులను పరిశీలించారు. స్పిల్‌వే పనులు వేగాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. పర్యటనను కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ కోటేశ్వర్రావు, ఎస్పీ రవిప్రకాష్‌లు పర్యవేక్షించారు.