నేటి ఉదయం తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు

శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం ఉదయం గేట్లెత్తి దిగువకు నీటిని వదలనున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టానికి దగ్గరగా ఉన్నా ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి విద్యుదుత్పత్తి ద్వారానే విడుదల చేయాలా లేక గేట్లు ఎత్తాల అన్న అంశంపై తర్జనభర్జన పడ్డారు. గురువారం ఉదయం మూడు గేట్లు ఎత్తి 84 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదలాలని నిర్ణయించారు. మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని, అక్టోబరు ఆఖరు వరకు శ్రీశైలంలో 883 అడుగుల మట్టం మాత్రమే నిర్వహించాలని కేంద్ర జలసంఘం కూడా సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి 884.40 అడుగులతో 212 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మూడున్నర టీఎంసీలు మాత్రమే తక్కువ ఉంది.మరోవైపు జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 88,559 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.మరికొద్ది రోజులు ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో విద్యుదుత్పత్తితో పాటు గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. మొదట మూడు గేట్లను ఒక్కొక్కటి పది అడుగులు ఎత్తి 84 వేల క్యూసెక్కులు విడుదల చేస్తారు. తర్వాత ప్రవాహాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య ఆంధ్రప్రదేశ్‌ జలనవరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారని కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి తెలిపారు.