నిర్లక్ష్యంగా వ్యవహరించారు

ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల విషయంలో తను దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌. నిర్మాత నల్లమలుపు బుజ్జితో కలిసి ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ పాత్రను క్యారెక్టర్‌ ఆర్టిస్టు కింద దరఖాస్తులో పేర్కొన్నారు కాబట్టే ఆ కేటగిరిలో అవార్డు ఇచ్చామంటూ ఓ గౌరవ జ్యూరీ సభ్యుడు అన్నారు. ఇది ఎంత మాత్రం సరైంది కాదు. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది సపోర్టింగ్‌ క్యారెక్టర్‌. అవార్డుల కమిటీకి పంపిన దరఖాస్తులోనూ అదే రాశాం. కథానాయిక ప్రాధాన్య చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తనకు తానుగా ఈ సినిమాలో నటించారు అల్లు అర్జున్‌. అంత గొప్ప మనసుతో చేసిన అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోకి క్యారెక్టర్‌ ఆర్టిస్టు కింద అవార్డు ఇవ్వడం చాలా బాధాకరం’’ అన్నారు. ‘‘అవార్డుల విషయంలో జ్యూరీ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గోన గన్నారెడ్డి పాత్రకు ఎన్నో అవార్డుల పొందారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వకపోతే బాగోదని అవార్డు ఇచ్చినట్టే ఉంద’’ని చెప్పారు గుణశేఖర్‌. ‘‘ఎవరూ చారిత్రక సినిమాలు తీయని సమయంలో నిర్మాతగా మారి తీసిన రుద్రమదేవి సినిమాకు సరైన రీతిలో అవార్డు ఇవ్వలేదనే బాధ కలుగుతుంద’’ని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేసుగుర్రం’ చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ ‘‘నేను నిర్మించిన ‘రేసుగుర్రం’ పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలుచుకొంది. కానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు రాకపోవడం బాధాకరమ’’న్నారు. కార్యక్రమంలో నిర్మాత వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
‘రుద్రమదేవి’కి నంది రాకపోవడం బాధాకరం
రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించకపోవడం బాధాకరమని దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా పోరాడారో అలాగే తెలుగుజాతి అభ్యున్నతికి రుద్రమదేవి పోరాడినట్లు భావిస్తామన్నారు. అలాంటి మహనీయురాలి జీవితాన్ని తెరకెక్కించినప్పుడు ప్రభుత్వం గుర్తించాలన్నారు. గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేలా అవార్డులు ఇచ్చే వారని, కానీ ఇప్పుడు అవి ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయని విమర్శించారు. బాహుబలి చిత్రం సాంకేతికంగా, వినోదపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అందుకు దర్శకుడు రాజమౌళికి సెల్యూట్‌ చేస్తున్నా అన్నారు. కానీ ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందన్నారు. ఇప్పుడు పూర్తిగా వాణిజ్య చిత్రాలకే పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా మారిందని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.