నా కార్యాలయంలోనే ఇన్ని రోజులా?

దస్త్రాల పరిష్కారానికి (ఫైల్స్‌ క్లియరెన్స్‌) తన కార్యాలయ కార్యదర్శులు కూడా ఎక్కువ రోజులు తీసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గడచిన త్రైమాసికంలో వారి దగ్గర సగటున ఒక్కో ఫైలు 42 రోజుల 11 గంటలు ఉందన్నారు. ‘‘ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇలా ఉంటే ఎలా? నాకంటే ముందే ఆఫీసుకి వస్తారో…ఇంకేం చేస్తారో? దస్త్రాలు మాత్రం పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు’’ అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఉన్నతాధికారుల వద్ద దస్త్రాలు ఎంతెంత కాలం అపరిష్కృతంగా (పెండింగ్‌) ఉంటున్నాయన్న అంశంపై ఆయన మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఉపముఖ్యమంత్రి (హోంశాఖ) చినరాజప్ప కేవలం నాలుగు గంటల్లో దస్త్రాన్ని పరిష్కరిస్తున్నారని, రెండో స్థానంలో లోకేష్‌ ఉన్నారని తెలిపారు. లోకేష్‌ ఆరు గంటల సమయం తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ఈయన వచ్చిన ఫైలు వచ్చినట్టూ పంపేస్తున్నట్టున్నాడు’’ అని చినరాజప్పనుద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సగటున ఒక్కో దస్త్రానికి 66 రోజులు తీసుకుంటున్నారంటూ… ‘‘ఈయన సమావేశాలకు రారు. ఇక్కడ కూడా కనిపించరు. ఆయనదో ప్రత్యేక ధోరణి’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి మాణిక్యాలరావు గురించి చెబుతూ… ‘‘ఆయన 9 గంటల 5 రోజుల సమయం తీసుకుంటున్నారు. గతం కంటే బాగా మెరుగుపడ్డారు. అంతకుముందు 77 రోజులు తీసుకునేవారు’’ అని పేర్కొన్నారు. మంత్రి అఖిలప్రియ 35.10 రోజుల సమయం తీసుకుంటున్నారని చెబుతూ… ఇలా అయితే ఎలా అమ్మా? అని ప్రశ్నించారు. ‘‘దాపరికం ఏమీ లేదు. మా పేషీ సహా ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని తెలిపారు. అధికారుల్లో శ్రీనివాస్‌ శ్రీనరేష్‌, జాస్తి కృష్ణకిశోర్‌ల పేర్లు మాత్రమే చదివారు. శ్రీనరేష్‌ 21 రోజులు, కృష్ణ కిశోర్‌ 25 రోజులు సమయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఈయన దగ్గరకు ఏం ఫైల్స్‌ వస్తున్నాయో’’ అని కృష్ణకిశోర్‌ ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘‘ఇందాకే చూశాను. సచివాలయంలో విపరీతంగా మనుషులు తిరుగుతున్నారు. మీరు దస్త్రాలన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే మనుషులు మీ చుట్టూ తిరగడం తగ్గిపోతుంది’’ అని మంత్రులు, అధికారులనుద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు.
రెండు నెలల్లో అన్ని దస్త్రాలూ ఆన్‌లైన్‌లోకి
వచ్చే రెండు నెలల్లో సచివాలయం నుంచి కింది స్థాయి వరకు దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో పెట్టినా కొన్ని అవసరమైన దస్త్రాల హార్డ్‌కాపీలు కూడా భద్రపరచాలని సూచించారు. ఆర్‌బీఐ ఇలానే చేస్తోందన్నారు. ఎక్కడ ఎలాంటి ఉత్తమ విధానాలున్నాయో పరిశీలించేందుకు అవసరమైతే ఇద్దరు ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించాలని తెలిపారు.