కుర్రాళ్లు హుషారుగా..

ఏమాత్రం అనుభవం లేదు. ఎలాంటి అంచనాలు లేవు. ప్రపంచకప్‌కు పూర్తిగా కొత్త. టోర్నీకే పసికూన. ఐతేనేమీ తొలి మ్యాచ్‌లో భారత్‌ కాస్త గౌరవప్రదమైన ప్రదర్శనే చేసింది. రెండో మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఓ గోల్‌ కూడా కొట్టింది. ఈ టోర్నీలో ఆడేందుకు తమకు అర్హత ఉందని చాటుకుంది. ఓడిపోయినా శభాష్‌ అనిపించుకుంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో గ్రూపులో ఆఖరి సమరానికి సన్నద్దమైంది.
మాజీ ఛాంపియన్‌తో ఘనాతో మ్యాచ్‌ నేడే. మరి తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ ఆకట్టుకుంటున్న కుర్రాళ్లు.. ఈ మూడో మ్యాచ్‌లో మరింత మెరుస్తారా ? మరింత అలరిస్తారా?
ఈ గ్రూప్‌-ఏ సమరంలో ఘనా తిరుగులేని ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే మొదటి మ్యాచ్‌కు ఈ మ్యాచ్‌కు ఒక్కటే తేడా. ఈసారి భారత జట్టు కాస్త అంచనాతో, కాస్త ఆశతో బరిలోకి దిగుతోంది. అలాగని అద్భుతాలు చేస్తుందని కాదు, సంచలనాలు సృష్టిస్తుందనీ కాదు. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్రదర్శనతో ప్రపంచంలో అత్యుత్తమ జట్లతో తాము పోటీపడగలమని నిరూపించుకున్న భారత జట్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆతిథ్య జట్టు మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయాలన్నది వారి కోరిక.
కొలంబియాపై కోచ్‌ డి మాటోస్‌ రక్షణాత్మక గేమ్‌ప్లాన్‌ను భారత కుర్రాళ్లు మెరుగ్గా అమలు చేశారు. కాస్త అదృష్టం తోడైతే భారత్‌ గెలిచేదే. మ్యాచ్‌లో చాలా వరకు కొలంబియాదే ఆధిపత్యం. కానీ తొలి అర్ధభాగంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదన్నది కోచ్‌ అభిప్రాయం. అంచనాలు పెరగడంతో కొలంబియాపై ప్రదర్శన గాలివాటం కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. ఐతే ఘనాతో పోరు చాలా కఠినమైందే. ఈ టోర్నీలోనే శారీరకంగా అత్యంత బలంగా ఉన్న జట్టు అది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ పోరులో ఘనా స్పష్టమైన ఫేవరెట్‌.