కలయిక… వేడుక

ఆకాశంలోని తారలన్నీ ఒక చోట చేరినట్టుగా… 1980వ దశకంలో వెండితెరని ఏలిన సినీ తారలంతా ఒక చోట కలుసుకొన్నారు. రెండు రోజులపాటు వేడుక చేసుకొన్నారు. అక్కడ ఇమేజ్‌ లేదు, స్టార్‌ స్టేటస్‌ లేదు. యాక్షన్‌ లేదు, కట్‌ లేదు. స్నేహితులుగా అంతా కలిసిమెలసి సందడి చేయడమే. ఎయిటీస్‌ స్టార్స్‌ రీ యూనియన్‌ పేరుతో దక్షిణాదికి చెందిన తారలంతా ప్రతీ యేట ఓ చోట కలుసుకోవడం ఆనవాయితీగా మారింది. ఈసారి మహాబలిపురం దగ్గర సముద్రతీరంలోని ఓ రిసార్ట్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తారలు 28 మంది కలుసుకొన్నారు. అలా కలుసుకోవడం ఇది 8వసారి. ముదురు ­దా రంగు విద్యుత్‌ దీపాలతో అలంకరించిన రిసార్ట్‌లో, అదే రంగు దుస్తుల్ని ధరించి రెండు రోజులపాటు ఆటపాటలతో సరదా సరదాగా గడిపారు తారలు. చిరంజీవి, వెంకటేష్‌, శరత్‌కుమార్‌, నరేష్‌, సురేష్‌, జాకీష్రాఫ్‌, భానుచందర్‌, రమ్యకృష్ణ, సుహాసిని, సుమలత, జయసుధ, లిజీ, ఖుష్బూ, రేవతి, శోభన, రాజ్‌కుమార్‌ సేతుపతి, పూర్ణిమ భరద్వాజ్‌ తదితర తారలు ఈ కలయికలో పాల్గొన్నవాళ్లలో ఉన్నారు.