ఎన్నికల ఫలితాల తర్వాత వారికి షాకే

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు కరెంట్ షాక్ తగులుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీలో వెనుకబడిన తూర్పు ప్రాంతం మిర్జాపూర్ ఎన్నికల ర్యాలీలో ఆయన శుక్రవారం మాట్లాడారు. యూపీలో కరెంట్ ప్రవహిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ప్రధాని విద్యుత్ వైర్లను ముట్టుకోవాలని ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈవిధంగా స్పందించారు. విద్యుత్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎలక్ట్రిక్ వైర్లను ముట్టుకోవాలని అఖిలేశ్ నన్ను సవాల్ చేశారు. ఇదే ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ నిర్వహించిన ఖాట్‌సభకు జనం హాజరై ఖాట్ (మంచాలు) లను తీసుకెళ్లేటపుడు అవి విద్యుత్ వైర్లను తాకాయి. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ ఆ వైర్లలో కరెంటు లేదని సమాజ్‌వాదీ పార్టీని విమర్శించారు అని మోదీ గుర్తుచేశారు. మీ స్నేహితుడే (రాహుల్) ఈ విషయాన్ని ఒప్పుకొన్నపుడు.. నేను వైర్లను ముట్టుకోవాల్సిన అవసరం ఉందా? మార్చి 11న మీకు (ఎస్పీ-కాంగ్రెస్), బీఎస్పీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇస్తారు అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాహుల్ ఖాట్‌సభ నిర్వహించినపుడు జనం మంచాలు తీసుకెళ్లారు. ఇపుడు అదేజనం కాంగ్రెస్‌ను ఓడిస్తారని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎస్పీ చేసిందేమీ లేదని, ఎక్కడచూసినా అవినీతే రాజ్యమేలిందని అన్నారు.