రామానాయుడుకు రాజోలు యువత సంఘీభావం

పాలకొల్లు, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు చేస్తున్న పోరాటానికి రాజోలు యువత సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం బిసి సెల్ నాయకులు, ఎ1 సేవా సమితి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ యువకులు శుక్రవారం నాడు పాలకొల్లు వచ్చి అన్న క్యాంటీన్ ఉద్యమం లో పాల్గొన్నారు. జూలై 31వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పాలకొల్లు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నెలకొల్పి శాసనసభ్యులు రామానాయుడు పేదలకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు.

ఈ అన్నదాన యజ్ఞం నిరంతరాయంగా కొనసాగేందుకు పలువురు తెలుగుదేశం నాయకులు సహకారం అందిస్తున్నారు. ఎ1 సేవా సమితి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ రూ.15 వేలు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ రూ. 6500 పాలకొల్లు అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళంగా శాసనసభ్యులు రామానాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపల్ మాజీ ఛైర్మన్ వల్లభ నారాయణ మూర్తి, మాజీ వైస్ ఛైర్ పర్సన్ రోజా రమణి, టిడిపి నాయకులు పొట్నూరి శ్రీనివాస్, గుడాల శ్రీనివాస్, కనపాల వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి జగదీష్, కట్టా ప్రసాద్, యాండ్ర రాము, అప్పారి దుర్గా ప్రసాద్, గుత్తుల శ్రీనివాస్, కె.పూర్ణ, పండు, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *