గన్నవరంను అగ్రగామిగా తీర్చిదిద్దుతారని అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్

పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్ చెప్పారు. పి.గన్నవరం మండలం పి.గన్నవరం, మొండెపులంక, నాగుల్లంక తదితర గ్రామాల్లో గురువారం నాడు స్టాలిన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వశిష్ట, వైనతేయ నదీ తీరాలతో, అపారమైన ప్రకృతి వనరులతో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని స్టాలిన్ చెప్పారు. పర్యాటకపరంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని స్టాలిన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ మెంబరు వంటి చిన్న పదవితోనే నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సాధించానని ఆయన వెల్లడించారు.

ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగపరంగా స్థిరపడడానికి అనేక అవకాశాలు తనకు ఉన్నప్పటికీ పుట్టిన ప్రాంతం రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గం పట్ల తనకు గల అవగాహన, రాజకీయ, అధికార వర్గాల్లో తనకు గల పరిచయాలతో అధిక నిధులు సాధించి అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. ప్రచారంలో టిటిడి సభ్యులు డొక్కా నాథ్ బాబు, మండల టిడిపి అధ్యక్షుడు ముచ్చర్ల సాయి సత్యనారాయణ, టిడిపి నాయకులు కట్టా అబ్బు, సంసాని పెద్దిరాజు, నీతిపూడి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ నాగిడి నాగేశ్వరరావు పలు ప్రాంతాల్లో స్టాలిన్ విజయం కోసం ప్రచారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *