iju

ఐజెయు, ఎపియుడబ్ల్యుజె ద్విపాత్రాభినయం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. తమ సమస్యల పరిష్కారానికి, తమ హక్కుల సాధనకు ఎవరు కృషి చేస్తున్నారు? జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు, తమ సొంత మీడియా సంస్థ సాక్షి గ్రూపును అభివృద్ధి చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తున్న పాలక పక్షానికి తాన తందాన అంటూ వంత పాడుతూ, పాలక వర్గం నామినేటెడ్ పదవుల పేరిట విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఎగబడే కొందరు నేతలు ఐజెయు, ఎపియుడబ్ల్యుజె పేరిట తామే ఉద్యమ నేతలుగా చలామణి కావడం సామాన్య జర్నలిస్టులను అయోమయానికి గురి చేస్తోంది. గతంలో ప్రభాస్ హీరో గా నటించిన మున్నా చిత్రంలో కాకా, ఆత్మ పేరిట రెండు పాత్రలు ఉన్నాయి. బయటకు కొట్టుకుంటున్నట్లు నటిస్తూ, తెర వెనుక పరస్పరం సహకరించుకుంటూ ఆ పాత్రలు లబ్ధి పొందుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తామే ప్రధాన జర్నలిస్టు సంఘం అని చెప్పుకునే ఎపియుడబ్ల్యుజె నేతలు, ఈ వంధిమాగధ నేతల పెత్తనం చూపించి ఐజెయు కూడా తమ చెప్పు చేతల్లో ఉందని అమాయక జర్నలిస్టు సోదరులను మభ్యపెడుతున్న నేతలు తెల్లవారితే పాలక పక్షం చుట్టూ తిరుగుతూ పదవుల కోసం ప్రాకులాడుతున్న తంతు నిత్యం చూస్తూనే ఉన్నాం.

ఇప్పటికే ఈ సంఘాల నేతలు పొందిన పదవుల సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ ఐజెయు అధ్యక్షుడిగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పదవులు నిర్వహించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ నియమితులయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ 2430 తీసుకు వచ్చి కలాలకు సంకెళ్ళు వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ జివో 2430 పట్ల జర్నలిస్ట్ సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జివోలో ఏ విధమైన తప్పు లేదని, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వ్రాసే వారికే ఇబ్బంది అని సదరు జాతీయ మీడియా సలహాదారు స్పష్టం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల గురించే ఈ జివో వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు.

ఇదే జాతీయ మీడియా సలహాదారు గారి జేబు సంస్థలైన ఐజెయు, ఎపియుడబ్ల్యుజె మాత్రం జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతుందని ఆందోళనలలో పాలుపంచుకుంటున్నారు. కథానాయక పాత్ర, ప్రతినాయక పాత్ర ఒకరే పోషించిన మాదిరిగా ఎపియుడబ్ల్యుజె కీలక నేతలు ప్రభుత్వంలో పదవులు పొంది ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ భజన చేస్తుంటే, అదే యూనియన్ నేతలు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటువంటి ద్విపాత్రాభినయం ముందెన్నడూ జర్నలిస్టు ఉద్యమాలలో కనీవినీ ఎరుగలేదు. ఈ పరిస్థితి పట్ల జర్నలిస్ట్ సోదరులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే మనతో ఉంటూ ఉద్యమం చేస్తున్నట్లు నటిస్తూనే ఈ ఉద్యమ నేతలు మనల్ని మూకుమ్మడిగా ప్రభుత్వానికి తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. జర్నలిస్టు సోదరులారా జరభద్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *