యువతకు జగన్ సర్కారు ద్రోహం: బోళ్ళ వెంకట రమణ

– గ్రామ సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలి
-తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ
రాజోలు, సెప్టెంబర్ 23: లీకేజీలతో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక పరీక్షలు నిర్వహించి జగన్ సర్కారు యువతకు ద్రోహం చేసిందని తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఆ పరీక్షా ఫలితాలను రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

సోమవారం రాజోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఏపీపీఎస్సీలో ఉద్యోగుల కుటుంబ సభ్యులకే పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చాయని, కష్టపడి చదివి రాసిన వారి మార్కుల్లో కోతలు విధించారని ఆరోపించారు. ఈ ఫలితాలతో నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనకు గురయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాల సమాచారం కోసం అనేక సార్లు హెల్ప్ లైన్‌కు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
ఏపీపీఎస్సీ చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల వచ్చిందని దుయ్యబట్టారు. దాదాపు 19 లక్షల అభ్యర్థుల ఆశలపై నీళ్ళుచల్లారని వెంకట రమణ వ్యాఖ్యానించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయని ఆయన ప్రశ్నించారు. కష్టపడి చదివి నిజాయతీగా పరీక్షలు రాసివ వారు పూర్తిగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని అవకతవకల మధ్య 14 విభాగాల్లో కేవలం 56 రోజుల్లో పరీక్షలు నిర్వహించామని, 11 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మేనేజిమెంటుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయని, అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేది ఆధ్వర్యంలోనే ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక పరీక్ష జరగడం, ఇందులోనూ అక్రమాలు చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వెంకట రమణ అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో అధిక శాతం తమ పార్టీ వారికే దక్కాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఈ అనుమానాలను బలపరుస్తోందని అన్నారు. తక్షణమే పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, లేకుంటే తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వెంకట రమణ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *