జర్నలిస్టుల ప్రమాద బీమా పధకం కొనసాగించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎపిఎంఎఫ్ వినతి

అమరావతి, మే 17: వర్కింగ్ జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా పధకాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీ బాబు రెడ్డి కోరారు. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి లక్ష్మీనరసింహంలకు శుక్రవారం నాడు వినతిపత్రాలు సమర్పించారు. మే 26వ తేదీతో పధకం కాలపరిమితి ముగుస్తోందని, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పధకం కొనసాగింపుపై సందిగ్థత నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమాచార సేకరణలో భాగంగా నిరంతరం పయనిస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఢిల్లీ బాబు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రూ.198 చొప్పున జర్నలిస్టులు, అంతే మొత్తం వాటాను ప్రభుత్వం చెల్లించే ఈ పధకం వల్ల ఎవరైనా జర్నలిస్టు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ. పది లక్షలు బీమా మొత్తం లభిస్తోందని ఆయన వివరించారు. ఈ ప్రమాద బీమా పధకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బాబు కోరారు. పధకం కొనసాగింపునకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఎపిఎంఎఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఢిల్లీ బాబుతో పాటు ఎపిఎంఎఫ్ నాయకులు చోడిశెట్టి స్వామినాయుడు, బోళ్ళ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *