మీడియాపై దాడులు శోచనీయం

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరం నుండి మొదలైన కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాలకు వ్యాపించింది. దీని నివారణకు ఇప్పటి వరకు ఏ విధమైన మందులు లేవు. వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. జన సాంద్రత అధికంగా ఉండే భారతదేశంలో ప్రజలు స్వీయ గృహ నిర్భంధంలో ఉండడం వల్ల వ్యాధి ఒకరి నుండి మరొకరికి విస్తరించకుండా క్వారంటైన్, ఐసోలేషన్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు.

ఇది అభినందనీయం. అయితే ఇదే సమయంలో కరోనాకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ప్రజలకు వాస్తవాలు అందించడానికి మీడియా ప్రతినిధులు కూడా అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియా ప్రతినిధులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కవరేజికి సహకరిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో విశాలాంధ్ర బ్యూరో దయాసాగర్ పై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. అనంతపురంలో కవరేజి చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేశారు. గురువారం నాడు హనుమాన్ జంక్షన్ వద్ద జర్నలిస్టులపై పోలీసులు లాఠీలు జళిపించారు. ఇది చాలా శోచనీయం.

కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు తాజా సమాచారం అందించాలనే తాపత్రయంతో జర్నలిస్టులు కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయి. విధి నిర్వహణలో కరోనా సోకే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అయినా విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం పోలీసులు గమనించాలి. జర్నలిస్టుల విధి నిర్వహణకు సహకారం అందించాలి. 

– పి. డిల్లీబాబు రెడ్డి.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్.
– బోళ్ళ సతీష్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *