జర్నలిస్టులకు రూ.25 వేలు సహాయం అందించాలి: డిల్లీబాబురెడ్డి

– సిఎం జగన్మోహనరెడ్డికి ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి డిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి
విజయవాడ, జూన్ 22: కోవిద్-19 సంక్షోభ నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు డిల్లీబాబు రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి అక్రిడేటెడ్ జర్నలిస్టుకు రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆ లేఖలో కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి, కోవిద్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా మొదటి వరుసలో నిలిచి పోరాడుతున్నారని డిల్లీబాబు రెడ్డి పేర్కొన్నారు. కరోనా సమాచార సేకరణలో, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయడంలో జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఆర్థిక సమస్యలను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి మరీ జర్నలిస్టులు విధి నిర్వహణలో ముందుకు సాగుతున్నారని డిల్లీబాబు రెడ్డి వివరించారు. కోవిద్-19 నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలను పరిశీలించి వారికి ఆర్థిక సహాయం అందించడానికి, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh, IPS Officers, Transfers, AP cm ys jagan

ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఎవరెవరు, ఎక్కడికి బదిలీ అయ్యారంటే..?

ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదీలీలు జరిగాయి. 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారలు వివరాలు ఇవే.

ఐపీఎస్ అధికారి పేరు
బదిలీ అయిన స్థానం
ద్వారకా తిరుమలరావు
రైల్వే డీజీపీ
బి. శ్రీనివాసులు
విజయవాడ సిటీ కమిషనర్
ఎన్. బాలసుబ్రహ్మణ్యం
ఏడీజీపీ ఆర్గనైజేషన్
కృపానండ్ త్రిపాఠి ఉజాలా
రోడ్ సేఫ్టీ ఏడీజీపీ
పిహెచ్డీ రామకృష్ణ
ఎస్ఈబీ డైరెక్టర్
ఆర్ఎన్ అమ్మిరెడ్డి
గుంటూరు అర్బన్ ఎస్పీ
అమిత్ బర్దార్
శ్రీకాకుళం ఎస్పీ
బి. ఉదయ్ భాస్కర్
డీజీపీ ఆఫీస్ అడ్మిన్
ఐశ్వర్య రస్తోగి
విశాఖ లాండ్ ఆర్డర్
అట్టాడా బాబూజీ
ఎస్ఐబీ ఎస్పీ
బి. కృష్ణారావు
విశాఖ రూరల్ ఎస్పీ
సిహెచ్. విజయారావు
విజయవాడ రైల్వే ఎస్పీ
నారాయణ నాయక్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ
నవదీప్ సింగ్ గ్రేవాల్
సీఐడీ ఎస్పీ
విశాల్ గున్నీ
గుంటూరు రూరల్ ఎస్పీ
ఎస్. రంగారెడ్డి
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశం
దీపిక
‘దిశ’ ప్రత్యేక అధికారిగా ఉన్న ఆమెకు… ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు

Tags: Andhra Pradesh, IPS Officers, Transfers, AP cm ys jagan

Telangana, Harish Rao, Corona Virus, PA corona virus

స్వీయ గృహ నిర్బంధంలోకి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన వార్త తెలిసిన మర్నాడే సిద్ధిపేటలోని మంత్రి పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు.

అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tags: Telangana, Harish Rao, Corona Virus, PA corona virus

Atchannaidu Acb Andhra Pradesh ESI Scam

ఈఎస్‌ఐ స్కాం కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశాం: ఏసీబీ జేడీ రవికుమార్

ఈఎస్‌ఐ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామని అవినీతి నిరోధక శాఖ జేడీ రవికుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో వీరు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని చెప్పారు.

హైకోర్టులో అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్ హౌస్‌ మోషన్‌ దాఖలు చేసినట్లు తమకు తెలిసిందని రవికుమార్ తెలిపారు. తాము కూడా న్యాయప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. దాదాపు 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వివరించారు.

పలు అంశాల్లో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ప్రభుత్వ అధికారులతో ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్లు తాము ఇప్పటివరకు గుర్తించామని వివరించారు.

రమేశ్‌కుమార్‌తో పాటు అచ్చెన్నాయుడిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చామని తెలిపారు. నేడు మరో ఐదుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చుతున్నామని వివరించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు.
Tags: Atchannaidu, Acb Andhra Pradesh, ESI Scam

Congress, Telangana Police, Vh hanumantha rao

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్న పోలీసులు

తెలంగాణలోని గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అడ్డుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు.

వైరాలో భట్టి విక్రమార్కను అడ్డుకోవడంతో పాటు కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ను అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను గృహనిర్బంధం చేశారు.
Tags: Congress, Telangana Police, Vh hanumantha rao

Aarogyasetu, Union Govt, Karnataka High Court

ప్రయాణానికి ‘ఆరోగ్యసేతు’ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం

ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన ఓ సైబర్ కార్యకర్త ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలు వెలిబుచ్చుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ కోర్టుకు తెలిపారు. ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవచ్చని కోర్టుకు తెలిపారు.

స్పందించిన కోర్టు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించేవారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనకు సంబంధించి చట్టబద్ధత ఉంటే తెలపాలంటూ కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది.
Tags: Aarogyasetu, Union Govt, Karnataka High Court

Jagan Crop Plan E-Marketing E-CROP Andhra Pradesh

మార్కెట్లో గిరాకీ లేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారు: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ప్లాట్ ఫాంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు.

ఈ-క్రాపింగ్ పై మార్గదర్శకాలు, ఎస్ పీవోలను రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ-క్రాపింగ్ విధానాలను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయుల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్లో గిరాకీ లేని, మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని తెలిపారు. 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించామని సీఎం జగన్ వెల్లడించారు.
Tags: Jagan Crop Plan E-Marketing E-CROP Andhra Pradesh

Nagababu Twitter Telugudesam

టీడీపీకి ప్రతిఫలం లభించడం మొదలైంది: నాగబాబు కీలక వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందడం ప్రారంభించిందని నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “కర్మకు ఏ విధమైన మెనూ లేదు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలియదు. అయితే, టీడీపీ ఇప్పుడు వారి డెజర్ట్ ను వడ్డిస్తోంది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఏడు వంటకాలున్న భోజనంలో 1 వంటకం మాత్రమే అందించబడింది, టిడిపి ఇప్పుడు వారు విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందుతోంది” అని వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ వైరల్ కాగా, భిన్న రకాల కామెంట్లను వస్తున్నాయి.
Tags: Nagababu Twitter Telugudesam

Corona Virus COVID-19 Andhra Pradesh

ఏపీలో మరో 76 మందికి కరోనా నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 10,567 శాంపిళ్లను పరీక్షించగా మరో 76 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,118 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 885 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,169 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.
Tags: Corona Virus COVID-19 Andhra Pradesh

Jagan Andhra Pradesh New Delhi

రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చిస్తారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం.
Tags: Jagan Andhra Pradesh New Delhi