Chandrababu, Corona Virus, India, Andhra Pradesh, Telugudesam, COVID-19

దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుందని అన్నారు. మొదట్లో విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితులయ్యారని, ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా సోకుతోందని వివరించారు. కరోనా వైరస్ కనీవినీ ఎరుగని విపత్తు అని, కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు.

ఇతర దేశాల్లో కరోనా కట్టడికి సత్ఫలితాలను ఇచ్చిన విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేతివృత్తుల వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.

Tags: Chandrababu, Corona Virus, India, Andhra Pradesh, Telugudesam, COVID-19

Pawan Kalyan, Janasena, Corona Virus, Donation, Andhra Pradesh

విరాళం ప్రకటించిన పవన్ ను అభినందించిన జనసేన నేతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కరోనాపై పోరాటానికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ను జనసేన నేతలు అభినందించారు. పవన్ నిర్ణయం కరోనా నివారణ చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పవన్ ఇవాళ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో నిరుపేదలు, రైతులు, కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎలా ఖర్చవుతున్నాయో గమనించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు.

Tags: Pawan Kalyan, Janasena, Corona Virus, Donation, Andhra Pradesh

మీడియాపై దాడులు శోచనీయం

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరం నుండి మొదలైన కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాలకు వ్యాపించింది. దీని నివారణకు ఇప్పటి వరకు ఏ విధమైన మందులు లేవు. వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. జన సాంద్రత అధికంగా ఉండే భారతదేశంలో ప్రజలు స్వీయ గృహ నిర్భంధంలో ఉండడం వల్ల వ్యాధి ఒకరి నుండి మరొకరికి విస్తరించకుండా క్వారంటైన్, ఐసోలేషన్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు.

ఇది అభినందనీయం. అయితే ఇదే సమయంలో కరోనాకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ప్రజలకు వాస్తవాలు అందించడానికి మీడియా ప్రతినిధులు కూడా అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియా ప్రతినిధులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కవరేజికి సహకరిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో విశాలాంధ్ర బ్యూరో దయాసాగర్ పై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. అనంతపురంలో కవరేజి చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేశారు. గురువారం నాడు హనుమాన్ జంక్షన్ వద్ద జర్నలిస్టులపై పోలీసులు లాఠీలు జళిపించారు. ఇది చాలా శోచనీయం.

కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు తాజా సమాచారం అందించాలనే తాపత్రయంతో జర్నలిస్టులు కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయి. విధి నిర్వహణలో కరోనా సోకే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అయినా విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం పోలీసులు గమనించాలి. జర్నలిస్టుల విధి నిర్వహణకు సహకారం అందించాలి. 

– పి. డిల్లీబాబు రెడ్డి.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్.
– బోళ్ళ సతీష్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.

Lockdown,Ap Government,Purchase Goods

నిత్యావసరాల కొనుగోలుకు ఏపీలో మినహాయింపు : లాక్ డౌన్ కట్టడిలో వెసులుబాటు

లాక్ డౌన్ కట్టడి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ప్రకటించింది. ముఖ్యంగా నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలు కోసం జనం ఎగబడిపోతుండడం చూసి అనవసర రద్దీని నివారించేందుకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలను సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్‌ రెడ్డి, ఆర్అండ్ బీ శాఖ కార్యదర్శి ఎం.కృష్ణ తదితరులు ఆయా జిల్లాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు.

వారు తెలిపిన వివరాల మేరకు… ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు, పాలవిక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో తమ నివాసిత ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాల వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వెళ్లాలి. అయితే గుంపులుగా జనం కొనుగోళ్లకు ఎగబడకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ అమలు విషయంలో సమస్యలుంటే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. విదేశీయులు, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలపై నిఘా ఉంచాలి. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారి కుటుంబాలను ఐసోలేషన్ వార్డుల్లో ఉంచాలి. విదేశీయుల కదలికలు, వైద్య చికిత్సల సమాచారం తెలిస్తే 104 ద్వారా ప్రజలు కూడా తెలియజేయవచ్చు.

నిత్యావసరాల సరఫరా చేసే వాహనాలను తిరిగేందుకు అనుమతించాలి. రైతుబజార్లకు కూరగాయలు తరలించేందుకు, నిత్యావసరాలు తరలించేందుకు ఆర్టీసీ బస్సుల సేవలు అందుబాటులోకి తేనున్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ప్రజలకు తెలిసేలా చేయడంతోపాటు ఆ పట్టికలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పక్కాగా నిషేధం అమల్లో ఉంటుంది.
Tags: Lockdown,Ap Government,Purchase Goods

Chandrababu,Telugudesam,Andhra Pradesh

అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి: చంద్రబాబు

అమరావతి పరిరక్షణ ఉద్యమం వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఈ రోజు వందో రోజు. అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ ఇన్ని రోజులు కొనసాగిన ఉద్యమం… ఇప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కొనసాగుతూనే ఉంది’ అని తెలిపారు.

‘రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ వాళ్లు దేశం కోసం అండగా నిలిచినట్టుగానే… రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్న అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి’ అని ట్వీట్లు చేశారు.

‘ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. రాజధాని అమరావతి ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Tags: Chandrababu,Telugudesam,Andhra Pradesh

Lockdown,Continue,Narendra Modi,April 15

అలా చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలి: లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. లాక్‌డౌన్‌పై అలక్ష్యం వద్దని, ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలని సూచించారు. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించి ఆచరించాలని పిలుపునిచ్చారు. మన భద్రత కోసమే లాక్‌డౌన్‌ ప్రకటించామని ట్వీట్లు చేశారు.

ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరాన్ని పాటించాలని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని గుర్తించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని నియమాలను పాటించాలని ఆయన కోరారు.

దేశ క్షేమం కోసం లాక్‌డౌన్‌ పాటించాలని ప్రజలను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ తెలిపారు. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ అనుభవాలను మర్చిపోవద్దని, మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించాలని చెప్పారు. చాలా మంది ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవట్లేదని, లాక్‌డౌన్‌ను తప్పకుండా తీవ్రంగానే పరిగణించి ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు కుటుంబాన్ని రక్షించుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తోన్న సూచనలను తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
Tags: Narendra Modi,BJP,Corona Virus

Jagan,Andhra Pradesh,Lock Down,Corona Virus

ఏపీలో తీవ్రత తక్కువగా ఉన్నా లాక్ డౌన్ విధిస్తున్నాం: సీఎం జగన్

ఇవాళ కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో భయానక వాతావరణం నెలకొని ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో పరిస్థితి అదుపులో ఉన్నా, ఇతర రాష్ట్రాల పరిస్థితులు, దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధించక తప్పడంలేదని పేర్కొన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చని సూచించారు. అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాంలు, ఆఫీసులు ముఖ్యమైన సిబ్బందితోనే నడపాలని తెలిపారు.
Tags: Jagan,Andhra Pradesh,Lock Down,Corona Virus

KCR,Telangana,Lock Down,Corona Virus,Janata Curfew

ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్: సీఎం కేసీఆర్ ప్రకటన

కరోనా విజృంభణ హెచ్చుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతిస్తారని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు.

రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు.
Tags: KCR,Telangana,Lock Down,Corona Virus,Janata Curfew

KTR,Corona Virus,Hyderabad

కరోనా వ్యాప్తి చెందకుండా హైదరాబాద్‌ అంతా శుభ్రం చేస్తోన్న సిబ్బంది.. ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు.
Tags: KTR,Corona Virus,Hyderabad

Kuwait,Gulf,Corona Virus,Andhra Pradesh,Kadapa District

కరోనాపై కువైట్ పోరు.. రెండేళ్ల చిన్నారి సహా 160 మంది తెలుగు వారిపై బహిష్కరణ వేటు!

కరోనాపై పోరు ప్రారంభించిన కువైట్.. అక్కడున్న విదేశీయులను అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తోంది. తాజాగా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశం తరలిస్తోంది. కువైట్ అదుపులోకి తీసుకున్న 350 మందిలో 160 మంది తెలుగువారే కావడం గమనార్హం. వీరిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, తెలుగువారిలోనూ అత్యధికులు కడప జిల్లావారేనని సమాచారం. ప్రస్తుతం కువైట్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ కువైట్ రాజు ఇచ్చిన అనుమతితో 350 మందితో కూడిన ప్రత్యేక విమానం నిన్న రాత్రి భారత్‌కు బయలుదేరింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తారు.
Tags: Kuwait,Gulf,Corona Virus,Andhra Pradesh,Kadapa District