Jagan Andhra Pradesh New Delhi

రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చిస్తారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం.
Tags: Jagan Andhra Pradesh New Delhi

Flight Crash, Pakistan, Karachi

కరాచీ విమాన ప్రమాదం.. మేడే, మేడే.. పైలట్ చివరి మాటలు ఇవే!

పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ పంపిన హెచ్చరికలకు సంబంధించిన కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం క్రాష్ కావడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘లైవ్ఏటీసీ.నెట్’లో ప్రత్యక్షమైంది. ఆ సంభాషణ ప్రకారం.. తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు ‘మేడే, మేడే, మేడే’ అనే సందేశాన్ని పైలట్ ఏటీసీకి పంపాడు. ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది.

తొలుత పైలట్ విమానం అప్రోచ్ అవుతున్నట్టు ఏటీసీకి తెలిపాడు. అందుకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మేం ఎడమవైపునకు తిరగాలా? అని పైలట్ మళ్లీ ప్రశ్నించాడు. దీనికి ఏటీసీ నుంచి ‘అవును’ అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయని, తాము నేరుగా వెళ్తున్నామని పైలట్ మళ్లీ చెప్పాడు. దీంతో స్పందించిన ఏటీసీ బెల్లీ ల్యాండింగ్‌కు కనుక సిద్ధపడితే కన్ఫామ్ చేయాలని కోరింది.

అంతేకాదు, ల్యాండింగ్‌కు 2, 5 రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అర్థం కావడం లేదని చెప్పిన పైలట్.. ‘మేడే, మేడే, మేడే’ అంటూ తాము ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. అనంతరం సంభాషణ తెగిపోయింది.

ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా పైలట్ గో-రౌండ్ (గాల్లో చక్కర్లు కొట్టేందుకే) మొగ్గు చూపాడని ఏటీసీ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ తెలిపారు.
Tags: Flight Crash, Pakistan, Karachi

Ayodhya Ram Mandir Idols Rama Janma Bhumi Shivling Pillars

ఆయోధ్య రామజన్మభూమి వద్ద బయటపడిన శివలింగం

దశాబ్దాల తరబడి నలిగిన అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అయోధ్యలోని రామజన్మభూమి వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడో శివలింగం లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు.

రామజన్మభూమిలో గత కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా, శివలింగంతో పాటు 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ కలశం, విరిగిపోయిన స్థితిలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. ఇటీవలే అక్కడ పూర్ణకుంభం కూడా బయల్పడిందని వీహెచ్ పీ నేత వినోద్ భన్సల్ తెలిపారు.
Tags: Ayodhya Ram Mandir Idols Rama Janma Bhumi Shivling Pillars

Maharashtra,Uddhav Thackeray,MLC Elections,Congress

ఉద్ధవ్ థాకరేకు లైన్ క్లియర్.. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

మహారాష్ట్రలో ఈ నెల 21న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉద్ధవ్ థాకరే సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితిలో మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు రాజేశ్ రాథోడ్, రాజ్‌కిశోర్ మోదీ నామినేషన్లు దాఖలు చేయడంతో శివసేనలో కొంత టెన్షన్ నెలకొంది. 9 స్థానాలకు 10 మంది అభ్యర్థులు వచ్చి చేరడంతో ఎన్నికలు తప్పనిసరయ్యాయి. దీంతో శివసేనలో గుబులు ప్రారంభమైంది.

ముందస్తు నిర్ణయం ప్రకారం మహా వికాస్ అఘాఢీలో భాగమైన కాంగ్రెస్ తొలుత ఒక్కరినే బరిలోకి దింపాలని భావించినా అనూహ్యంగా ఇద్దరు నామినేషన్ వేయడంతో కాంగ్రెస్-శివసేన మధ్య చెడిందని భావించారు. అయితే, నిన్న ఆ పార్టీ అభ్యర్థి రాజ్ కిశోర్ మోదీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Tags: Maharashtra,Uddhav Thackeray,MLC Elections,Congress

Corona Virus,COVID-19,India

భారత్‌లో తీవ్రతరమైన కరోనా.. 24 గంటల్లో 4,213 మందికి సోకిన వైనం

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏ రోజూ నమోదుకానన్ని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకింది.

గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు.
Tags: Corona Virus,COVID-19,India

Corona Virus,New Cases,Guwahati IIT,Study

జూన్ 10 నాటికి కనీసం లక్షన్నర కరోనా కేసులు… తాజా అధ్యయనం

వచ్చే నెల రోజుల వ్యవధిలో ఇండియాలో కనీసం లక్షన్నర కరోనా కేసులు నమోదవుతాయని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది. సింగపూర్ కు చెందిన డూక్ – నుజ్ మెడికల్ స్కూల్, గువాహటి ఐఐటీలు సంయుక్తంగా, ఇండియాలో వైరస్ వ్యాప్తి అంచనాపై ఓ నమూనాను రూపొందించాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కేసుల నమోదును పరిశీలించి వైరస్ వ్యాప్తిపై లెక్కలు గట్టారు. రానున్న నెల రోజుల్లో కనీసం 1.50 లక్షలు, వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే గరిష్ఠంగా 5.5 లక్షల కేసులు నమోదు కావచ్చని అంచనా వేశారు.

గడచిన రెండు వారాల వ్యవధిలో కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గని రాష్ట్రాలను ఓ భాగంగా, కేసులు తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా, యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా తీసుకుని ఈ అంచనాను రూపొందించినట్టు గువాహటి ఐఐటీ బృందం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల, వైరస్ వ్యాప్తిపై ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భిన్నంగా ఉండటంతో, కేసుల అంచనా విషయంలో దేశమంతటినీ ఒకే విధంగా భావించకుండా, మూడు భాగాలు చేశామని తెలిపారు.
Tags: Corona Virus,New Cases,Guwahati IIT,Study

New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగే రైళ్ల వివరాలు!

సుమారు 50 రోజుల తరువాత రేపటి నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసిన రైల్వే శాఖ, బుకింగ్ కౌంటర్స్ వద్ద టికెట్లను విక్రయించడం లేదని స్పష్టం చేసింది.

హౌరా – న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ – న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – జమ్మూతావి, బెంగళూరు – న్యూఢిల్లీ, తిరువనంతపురం – న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ, బిలాస్ పూర్ – న్యూఢిల్లీ, రాంచీ – న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ – న్యూఢిల్లీ, అగర్తలా – న్యూఢిల్లీ, భువనేశ్వర్ – న్యూఢిల్లీ, మడ్ గావ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.

ఇక రేపటి నుంచి తిరిగే రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలను పరిశీలిస్తే…

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
Tags: New Delhi,Trains,Reservation,Andhra Pradesh,Telangana

Vizag Gas Leak, Chandrababu, Narendra Modi, letter

విశాఖ ఘటనపై దర్యాప్తు కోరుతూ మోదీకి చంద్రబాబు లేఖ

విశాఖపట్టణంలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.

తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనపై సత్వరమే స్పందించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్యాస్ లీకేజీపై విచారణ కోసం సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని, విషవాయువు లీకేజీకి దారితీసిన అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరారు. పరిశ్రమ నుంచి లీకైన వాయువును స్టిరీన్‌గా కంపెనీ చెబుతోందని, కానీ దానితోపాటు మరిన్ని వాయువులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయని, కాబట్టి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.
Tags: Vizag Gas Leak, Chandrababu, Narendra Modi, letter

Bank, Sbi India, basmati rice

మరో ఎగవేత కేసు: భారతీయ బ్యాంకుల నుంచి 414 కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పరారీ!

భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోతున్న వారి ఉదంతాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది బడా పారిశ్రామికవేత్తలు విదేశాలకు పారిపోవడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇటువంటి ఘటనే మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‌ఢిల్లీకి చెందిన బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తి చేసే రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ యజమానులు ఎస్బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకుల నుంచి‌ మొత్తం రూ.414 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసుల్లో వారు డిఫాల్ట‌ర్లుగా ఉన్నారు. 2016 నుంచి ఆ డిఫాల్ట‌ర్లు కనపడట్లేదు. వీరు విదేశాలకు చెక్కేశారని తెలుస్తోంది.

వారు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిల జాబితాలో 2016లోనే దీన్ని చేర్చారు. అయితే, నాలుగేళ్ల తర్వాత.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న డిఫాల్ట‌ర్ల‌పై ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. దీనిపై సీబీఐ ఏప్రిల్ 28వ తేదీన కేసు బుక్ చేసింది. ఆ సంస్థకు చెందిన వారు ఎస్‌బీఐ నుంచి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.76.09 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.64.31 కోట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.51.31 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ. 36.91 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.12.27 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆ కంపెనీ డైర‌క్ట‌ర్లు న‌రేశ్ కుమార్‌, సురేశ్ కుమార్‌, సంగీత‌, ఇత‌రుల‌పై సీబీఐ ఫోర్జ‌రీ, చీటింగ్ కేసుల‌ను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.
Tags: Bank, Sbi India, basmati rice

Narendra Modi,Maharashtra,Train Accident

రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను: మోదీ

ఈ రోజు తెల్లవారు జామున మహారాష్ట్రలోని ఔరంగాబాద్-నాందేడ్ రైల్వే మార్గంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరికొంత మందికి చికిత్స అందుతోంది. ఇక ఈ ఘటన గురించి తెలుసుకుని చాలా కలత చెందానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలుసుకుని చాలా బాధపడ్డాను. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ఔరంగాబాద్‌ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైలు పట్టాలపై కూలీలు ఉన్న విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Tags: Narendra Modi,Maharashtra,Train Accident