Goddess Lakshmi is known as the Goddess of Wealth and Prosperity

శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన

జీవితంలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు అతి దుర్భరమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. సమస్యలు .. ఆపదలు .. అనారోగ్యాలు పలకరించినప్పుడు, ఆర్ధిక పరమైన స్థోమత బాగుంటే మిగతా వాటిని ఎదుర్కునే ధైర్యం ఉంటుంది. ఆర్ధిక పరమైన బలం లేనప్పుడు మనిషి మరింత బలహీనుడిగా మారిపోతాడు. అందుకే ఆర్థికపరమైన సామర్థ్యం కోసం ఎవరికివారు తమవంతు కష్టపడుతుంటారు.

ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ప్రీతి కలిగేలా ఆరాధించాలి. శుక్రవారం అనేది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అనే విషయం తెలిసిందే. ఆ రోజున అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి .. గులాబీలతో అర్చించి, ఆ తల్లికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆర్ధిక పరమైన సమస్యలు తొలగిపోయి, సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags: Goddess Lakshmi, known as the, Goddess of, Wealth and Prosperity

మొదలైన కార్తీకమాసం… ఆలయాల్లో భక్తుల కిటకిట!

నిన్న అమావాస్య మిగులు
నేటి నుంచి కార్తీక మాసం
రద్దీ రోజుల్లో శ్రీశైలంలో పలు ఆర్జిత సేవలు రద్దు
ఒక్క రోజులో పంచారామాల దర్శనం
ఏపీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు
హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. నిన్న సూర్యోదయం వేళ అమావాస్య ఘడియలే ఉండటంతో, నేటి నుంచి కార్తీకమాసం మొదలైనట్టు పంచాంగకర్తలు ఉటంకించిన సంగతి తెలిసిందే.

ఇక శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. రద్దీ రోజుల్లో సుప్రభాతం, మహా మంగళ హారతి, లక్ష కుంకుమార్చన, నవావరుణ పూజ, బిల్వార్చన తదితర సేవలను రద్దు చేసినట్టు ప్రకటించారు.

మరోవైపు శ్రీకాళహస్తిలోనూ ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. సోమ, శని, ఆది వారాల్లో సేవలను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నుంచి బయలుదేరి ఒక్కరోజులో పంచారామాలను దర్శించుకుని వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
Tags: Kartika Masam, Amavasya, Srisailam, Srikalahasti, Andhra Pradesh, Tourism

యాదాద్రిలో ‘హరే రామ హరే కృష్ణ’ ఆశ్రమం నేలమట్టం

  • యాదాద్రి చుట్టూ ఆరు లేన్ల రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం
  • అడ్డంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమం
  • నోటీసులు ఇచ్చినా స్పందించని ఆశ్రమ నిర్వాహకులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న ఆరులేన్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న  హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు నిన్న కూల్చేశారు. భారీ భద్రత మధ్య జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి ఆశ్రమం అడ్డంగా ఉండడంతో ప్రభుత్వం ఈ ఆశ్రమానికి చట్టప్రకారం కోటిన్నర రూపాయలను నష్టపరిహారంగా డిపాజిట్ చేసింది. అయినప్పటికీ సంబంధిత వ్యక్తులు ఎవరూ స్పందించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆశ్రమాన్ని కూల్చక తప్పలేదని ఆర్డీవో తెలిపారు.

ఆశ్రమ కూల్చివేతను అడ్డుకునేందుకు బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూ ధార్మిక సంస్థలు వస్తాయని భావించిన పోలీసులు ముందస్తుగా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం దానిని కూల్చివేశారు. కూల్చివేత సమయంలో లభించిన కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామగ్రిని యాదాద్రి దేవస్థానానికి తరలించినట్టు ఆర్డీవో పేర్కొన్నారు.

జల దిగ్బంధంలో మహానంది… దర్శనాలు రద్దు!

  • నిన్న రాత్రి నుంచి భారీ వర్షం
  • నీట మునిగిన పంచ లింగాలు
  • నంద్యాలతో రాకపోకలు కట్

గత రాత్రి నుంచి కర్నూలు జిల్లాలో కొలువైన స్వయంభూ మహా నందీశ్వర క్షేత్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు, ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మహానందిలోని మూడు కోనేర్లూ నిండిపోయి, నీరు ఎగువకు ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. వందలాది ఎకరాల్లోని అరటి తోటల్లోకి నీరు ప్రవేశించింది.

ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి ప్రవేశించిన వరద నీరు, ఆపై పంచలింగాల మంటపాన్నీ ముంచెత్తగా, ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. రుద్రగుండం కోనేరులో వరద ఉద్ధృతికి పంచలింగాలూ మునిగిపోయాయి. మరోవైపు పాలేరు వాగు ఉద్ధృతితో నంద్యాల – మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకూ భక్తులు ఆలయానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హోలీ ఎఫెక్ట్: రేపటి నుంచి 22 వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్

హోలీ ఎఫెక్ట్: రేపటి నుంచి 22 వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్

రంగుల పండుగ హోలీ సందర్భంగా బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంటే మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరిన ఆయన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని, గుంపులుగా వాహనాలపై ప్రయాణించవద్దని, వాహనాలపై వెళ్తున్న వారిపై రంగులు చల్లరాదని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.
Tags: holi festival 2019, hyderabad city, cp anjani kumar

విజయవాడలో ఉద్రిక్తతక

వైసీపీ నేత గౌతం రెడ్డి వ్యాఖ్యలు విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. వంగవీటి రంగా హత్యను ఆయన సమర్థిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ భగ్గుమనడానికి కారణమయ్యాయి. చివరికి రాధా, ఆయన తల్లి రత్నకుమారి అరెస్ట్‌కు దారి తీశాయి. ఇంతకీ గౌతం రెడ్డి ఏమన్నారంటే..

వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు. ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు.

నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కాకినాడలో ఊహించిన ఫలితమే.!

ఉప ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా అధికార పార్టీకి వుండే ‘ఎడ్జ్‌’ ప్రత్యేకం. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితమైనా, నేడు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నిక ఫలితమైనా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే, అదో సెన్సేషన్‌. ప్రతిపక్షం వెనుకబడటం అనేది సాధారణమైన వార్తే. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ అధికార పార్టీ విజయం సాధించడమూ సాధారణమైన వార్తగానే భావించాలేమో.!

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పెద్దగా అధికార పార్టీకి పోటీ ఇచ్చినట్లు కన్పించడంలేదు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడి తనయుడ్ని ఓడించడంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హమిక్కడ.

సదరు ఎమ్మెల్యే మొత్తంగా తన బలాన్నంతా 22వ డివిజన్‌ మీద ఫోకస్‌ పెట్టినా ప్రయోజనం లేకుండాపోయింది. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు శివకుమార్‌పై, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిషోర్‌ ఘనవిజయాన్ని అందుకున్నారు. మరో డివిజన్‌నీ కైవసం చేసుకుంది వైఎస్సార్సీపీ. టీడీపీ 13కి పైగా డివిజన్లలో విజయం సాధించింది. ఇది ఉదయం 10 గంటల నాటి పరిస్థితి. మరో 2 గంటల్లోనే పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొత్తంగా ఫలితాలు ఇందుకు భిన్నంగా వుండే అవకాశాలైతే లేవు. మెజార్టీ స్థానాలు టీడీపీ – బీజేపీ కూటమి కైవసం చేసుకోనుండడంతో కాకినాడ మేయర్‌ పదవి తెలుగుదేశం పార్టీ వశం కావడం లాంఛనమే కావొచ్చు.

రేపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ..

8మంది ఔట్.. ఏపీ నుంచి హరిబాబుకు చోటు?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శనివారమే కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందులో భాగంగా ఎన్డీయేలోకి ఇటీవల వచ్చి చేరిన జేడీయూకు కేబినెట్‌లో స్థానం కల్పించనుండగా, అన్నాడీఎంకే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ప్రస్తుత మంత్రుల్లో 8 మందిపై కత్తివేలాడుతుండగా, మరో 8 మంది శాఖలు మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్, ఉమాభారతి, ఫగన్ సింగ్ కులస్తే, గిరిరాజ్ సింగ్ రాజీనామా చేయగా వీరిలో రాజీవ్ రూడీ, సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. ఉమాభారతి అనారోగ్య కారణాలతో రాజీనామా సమర్పించారు.

ఇక పదవి కోల్పోనున్న వారిలో నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా ఉన్నట్టు తెలుస్తోంది. నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తుండగా, సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు శాఖ మారిపోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక, రక్షణ శాఖల బాధ్యతలు మోస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తిస్థాయిలో అప్పగించి ఆర్థిక శాఖను పీయూష్‌కు అప్పగించే యోచనలో ఉన్నారు. ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు కేబినెట్‌లో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాట అస్థిర పరిస్థితులపై కేంద్రం దృష్టి..

అసెంబ్లీ సుప్త చేతనావస్థకు నిర్ణయం!

మిళనాడులోని అధికార అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ వర్గాల మధ్య వర్గ పోరు మరింత ముదరడంతో కేంద్రం రంగంలోకి దిగింది. తమిళనాట అస్థిర పరిస్థితులు ఏర్పడడంతో అసెంబ్లీని కొన్నాళ్లు సుప్త చేతనావస్థలో ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 22 మంది దినకరన్ వర్గంలో చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. పళని సర్కారు బలం 113కు తగ్గి మైనారిటీలో పడింది. ప్రభుత్వం నిలబడాలంటే పళని వర్గానికి ఇంకా ఐదుగురు శాసనసభ్యులు అవసరం.

మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహించిన కీలక సమావేశానికి 28 మంది శాసన సభ్యులు డుమ్మా కొట్టారు. వీరంతా దినకరన్ మద్దతుదారులై ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో కంగారు పడిన పళనిస్వామి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై దృష్టి సారించిన కేంద్రం అస్థిర పరిస్థితులను కొనసాగించడం కంటే శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వారాలు, లేదంటే 2019 సాధారణ ఎన్నికల వరకు అలాగే కొనసాగించాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.

2019 కల్లా స్విస్ నల్లకుబేరుల జాబితా ఇస్తాం: స్విస్ అధ్యక్షురాలి హామీ

 

నల్లకుబేరుల వివరాల తొలి జాబితాను 2019 కల్లా అందజేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ ల్యూథర్డ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన విస్తృత చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, పన్ను ఎగవేత, నల్లధనాన్ని వెలికితీసేందుకు సహకారంపై అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ) లో, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో సభ్యత్వానికి మద్దతు తెలపడంపై ఆమెకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేత సమాచార ఆటోమేటిక్ మార్పిడి చట్టాన్ని ఈ ఏడాది చివరికంతా పార్లమెంటు ఆమోదిస్తుందని ఆమెకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో సహకారానికి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.