తెలంగాణకు కొత్త సమస్య… కల్లు, మద్యం దొరక్క వింత ప్రవర్తనలు, ఆత్మహత్యలు!

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారు ముందు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. నిత్యమూ కల్లు, మందుకు అలవాటు పడిన వారు, ఇప్పుడు అవి దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఇందూరులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా, నిజామాబాద్‌ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవ్యక్తి ఫిట్స్‌ వచ్చి మరణించాడు.

నగరంలోని సాయినగర్‌ కు చెందిన శకుంతల (65)కు నిత్యమూ కల్లు తాగడం అలవాటు. గత వారం రోజులుగా కల్లు అందుబాటులో లేకపోగా, రెండు రోజుల నుంచి పిచ్చిగా ప్రవర్తించిన ఆమె, శుక్రవారం రాత్రి ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్‌ తాగేసింది. దీన్ని గమనించిన ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మరణించింది.

ఇదే సమయంలో మద్యం తాగే అలవాటున్న శంకర్‌ (45) అనే వ్యక్తి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి ముదిరాజ్‌ వీధిలో ఉండే భూషణ్‌ అనే మరో వ్యక్తి, కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఫిట్స్‌ వచ్చి చనిపోయారని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కల్లు గీసుకుని, అమ్ముకోవడానికి తన టూ వీలర్ పై వస్తున్న బాలనర్సాగౌడ్‌ (72), రోడ్డుపై వేసివున్న చెట్ల కొమ్మలు, మొద్దులను దాటే క్రమంలో ప్రమాదానికి గురై మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

కాగా, తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి బానిసలు అయినవారు లక్షల్లో ఉన్నారు. వీరికి మరికొన్ని రోజులు మద్యం అందుబాటులో లేకుంటే, ఈ తరహా మరణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని సలహా ఇస్తున్నారు.
Tags: Telangana, Wines Toddy, Sucide, Lockdown

London,Corona Virus,DSP,Bhadradri Kothagudem District,Gandhi Hospital

లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్!

లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన డీఎస్పీ కుమారుడి (23)కి కరోనా పాజిటివ్ అని తేలడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేగింది. అతడితోపాటు కుటుంబ సభ్యులు మొత్తాన్ని వెంటనే గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లండన్‌లో చదువుకుంటున్న యువకుడు ఈ నెల 18న హైదరాబాద్ వచ్చాడు.

అనంతరం కారులో కొత్తగూడెం వెళ్లాడు. 20వ తేదీ వరకు అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఈ సందర్భంగా కొందరు బంధుమిత్రులను కూడా కలిశాడు. 20న దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అదే రోజు అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. నిన్న అతడికి సంబంధించిన రిపోర్టులు రాగా, కరోనా పాజిటివ్ అని వచ్చింది.

డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పోలీసు శాఖలోనూ ఆందోళన మొదలైంది. డీఎస్పీకి కూడా కరోనా సోకే ఉంటుందని భావిస్తున్నారు. ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు, బాధిత యువకుడిని తీసుకెళ్లిన కారు డ్రైవర్ సొంతూరు వెళ్లినట్టు తెలియడంతో అక్కడి వారిలోనూ ఆందోళన మొదలైంది.
Tags: London,Corona Virus,DSP,Bhadradri Kothagudem District,Gandhi Hospital

KCR,Telangana,Lock Down,Corona Virus,Janata Curfew

ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్: సీఎం కేసీఆర్ ప్రకటన

కరోనా విజృంభణ హెచ్చుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతిస్తారని వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని హితవు పలికారు.

రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు.
Tags: KCR,Telangana,Lock Down,Corona Virus,Janata Curfew

KTR,Corona Virus,Hyderabad

కరోనా వ్యాప్తి చెందకుండా హైదరాబాద్‌ అంతా శుభ్రం చేస్తోన్న సిబ్బంది.. ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు.
Tags: KTR,Corona Virus,Hyderabad

Telangana,Corona Virus,Dubai,London,Gandhi Hospital

తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు.. 16కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా నిన్న మూడు కొత్త కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 16కు చేరింది. దుబాయ్ నుంచి ఈ నెల 14న నగరానికి వచ్చిన 50 ఏళ్ల వ్యాపారిలో 17న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆయనను కలిసిన వారిని కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. విమానంలో అతడితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులకు వైరస్ సోకింది. వీరిద్దరినీ నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వీరిద్దరిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tags: Telangana,Corona Virus,Dubai,London,Gandhi Hospital

KCR, Telangana, Corona Virus

కరోనాపై కేసీఆర్ అత్యవసర అత్యున్నతస్థాయి సమావేశం..

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కీలక సూచనలు చేస్తూ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
Tags: KCR, Telangana, Corona Virus

KTR TRS, Narendra Modi, BJP, Corona Virus

ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వినతి

కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేటీఆర్ వినతి చేశారు.

‘శ్రీ నరేంద్ర మోదీజీ.. మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి మిషన్ ప్రారంభించి, వారి కనీస అవసరాలు తీర్చండి.. వారిని సురక్షితంగా భారత్‌ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి’ అని కోరారు. ఈ సందర్భంగా పలువురు తనకు చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఆయన పోస్ట్ చేశారు.
Tags: KTR TRS, Narendra Modi, BJP, Corona Virus

KTR,Telangana,Twitter

వారిని రక్షించండి: కరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రులకు కేటీఆర్‌ ట్వీట్

కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మనీలా, కౌలాలంపూర్‌, రోమ్‌లోని విమానాశ్రయాల్లో్ చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వారి పరిస్థితుల గురించి వెంటనే స్పందించి, వారిని స్వదేశానికి తీసుకురావాలని తాను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.

కాగా, తెలుగు విద్యార్థులు స్వదేశానికి రాలేక కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే, పలు ప్రాంతాల్లో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు దేశాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తుండడంతో భారతీయులు స్వదేశానికి బయల్దేరుతున్నారు.
Tags: KTR,Telangana,Twitter

Telangana Assembly,CAA,KCR,Birth Certificate

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు… నేనెక్కడి నుంచి తేవాలి?: అసెంబ్లీలో కేసీఆర్

ఐదువందల ఎకరాల భూస్వాముల కుటుంబంలో పుట్టిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, ఇక ఎప్పుడో పుట్టిన సామాన్యులు ఇప్పుడు సర్టిఫికెట్ తెమ్మంటే ఎక్కడ నుంచి తెస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.

ఈ రోజు అసెంబ్లీలో సీఏఏపై చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం, జనాభా రిజిస్టర్ తదితరాలను కేవలం హిందూ, ముస్లింల అంశంగా చూడవద్దన్నారు. ఇవి అమల్లోకి వస్తే ఎదురయ్యే పరిణామాల తీవ్రతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.

‘నేను చింతమడకలోని మా ఇంట్లో పుట్టాను. అప్పట్లో మా పెద్దోళ్లు ఊళ్లో ఉండే పెద్దమనుషులను పిలిపించి వారి సమక్షంలో నా జన్మపత్రిక రాయించారు. అంతేతప్ప ఎటువంటి సర్టిఫికెట్ లేదు’ అని వివరించారు. ఈ పరిస్థితుల్లో దళితులు, గిరిజనులు, కూలీనాలీ చేసుకునే జనం, ఓసీల్లో పేదల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

సీఏఏ వంటి చట్టాల వల్ల దేశ ప్రతిష్ఠ మంటగలుస్తోందన్నారు. కొన్ని కోట్ల మందికి సర్టిఫికెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశంలో విభజన రాజకీయాలు మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ లౌకిక పునాదులపై ఏర్పడిందని, దానికే కట్టుబడి ఉంటుందన్నారు. అసహన వైఖరి, భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైన విధానం కాదని కేసీఆర్ అన్నారు.
Tags: Telangana Assembly,CAA,KCR,Birth Certificate