భాగ్యనగరిలో హైఅలర్ట్‌…మక్కా మసీదులో భారీ బందోబస్తు

పన్నెండేళ్ల క్రితం అనగా 2007 మే 18వ తేదీన హైదరాబాద్‌ నగరాన్ని కుదిపేసిన మక్కామసీదు బాంబు పేలుళ్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని మక్కామసీదులోని ఓ పైపులో అమర్చిన బాంబును సెల్‌ఫోన్‌తో పేల్చిన ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత జరిగిన అల్లర్ల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమయింది. బాగ్యనగరి వాసుల మదిలో నుంచి చెరిగిపోని జ్ఞాపకాల్లో ఈ ఘటన ఒకటి. క్షణాల్లో తీవ్రవిషాదం చుట్టుముట్టేసి కళ్లముందే పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకుని ఇన్నేళ్లయినా ఇప్పటికీ పాతబస్తీ వాసుల గుండెల్లో పేలుళ్ల శబ్దాలు మారుమోగుతూనే ఉంటాయి.

దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు చోటు చేసుకున్నా ఆ మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయన్న ఆరోపణలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పేలుళ్ల రోజును దృష్టిలో పెట్టుకుని నగర వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను మోహరించారు. అనుమానిత వ్యక్తులను నీడలా వెంటాడేందుకు షాడో టీంలను ఏర్పాటు చేశారు.

ఎటువంటి పరిస్థితినైనా తక్షణం ఎదుర్కొనేందుకు వీలుగా క్విక్‌ రియాక్షన్‌ టీం, స్ట్రయికింగ్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షణ కొనసాగుతోంది. బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఐపీఎస్‌ అధికారులతోపాటు పలువురు సీనియర్‌ అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుక్షణం డేగ కళ్లతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

శ్రీలంక పేలుళ్ల ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

శ్రీలంక పేలుళ్ల ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో ప్రముఖ వ్యాపారి కుమారులు
వ్యాపారి, వారి మూడో కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీలా హోటళ్లలో దాడులు జరిపింది వారే
ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. హోటళ్లు, చర్చిలలో పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి అయిన మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్‌ అహ్మద్‌ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్‌ ఇబ్రహీం (31) ఉన్న విషయం తాజాగా బయటపడి సంచలనమైంది. మసాల దినుసుల వ్యాపారంలో యూసుఫ్ ఇబ్రహీం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

అన్నదమ్ములైన ఇమ్సాత్, ఇల్హాం ఇద్దరూ బ్యాగుల్లో బాంబులు నింపుకుని కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌, షాంగ్రీ లా హోటళ్లలో దాడులకు పాల్పడినట్టు సమాచారం. వీరి పేర్లు బయటకు రాగానే యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్‌ అహ్మద్‌ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయటపడి సంచలనమైంది.

ముందస్తు సమాచారం ఉన్నా దాడులు ఆపలేకపోయాం... క్షమించండి!: శ్రీలంక ప్రభుత్వం ప్రకటన

ముందస్తు సమాచారం ఉన్నా దాడులు ఆపలేకపోయాం… క్షమించండి!: శ్రీలంక ప్రభుత్వం ప్రకటన

దారుణంపై చింతిస్తున్నాం
కొన్నిరోజుల ముందే హెచ్చరికలు అందాయి
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ఈస్టర్ సందర్భంగా జరిగిన నరమేధంపై పది రోజుల ముందే సమాచారం ఉన్నా దాడులను అడ్డుకోలేకపోవడం పట్ల శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా చింతిస్తోంది. నిస్సందేహంగా ఇది తమ వైఫల్యమేనని అంగీకరించింది. ఈ మేరకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రతినిధి రజిత సేనరత్నే పేరిట ఆ ప్రకటన వెలువడింది.

“జరిగిన సంఘటనల పట్ల బాధపడుతున్నాం. నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా తగిన రీతిలో స్పందించలేకపోయాం. బాధితుల కుటుంబాలకు, సంస్థలకు ప్రభుత్వం క్షమాపణలు తెలుపుకుంటోంది. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు దెబ్బతిన్న చర్చిల పునర్నిర్మాణం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీలంక పేలుళ్ల ఘటనలో 290కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంక పేలుళ్ల ఘటనలో 290కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య నేటి ఉదయానికి 290కి చేరిందని అధికారులు అంచనా వేశారు. మరో 500 మంది గాయపడిన వారున్నారు. క్షతగాత్రులు అధిక సంఖ్యలో ఉండడంతో మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో మొత్తం 32 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులని శ్రీలంకలోని భారత్‌ హైకమిషనర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. నిన్న సాయంత్రానికి రమేష్‌, లక్ష్మి, నారాయణ చంద్రశేఖర్‌ అనే వ్యక్తులు చనిపోయినట్లు వెల్లడించిన అధికారులు హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప అనే ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయినట్లు ఈరోజు తెలిపారు.

ఇప్పటివరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు మరిన్ని పేలుడు ఘటనలకు ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండి తనిఖీలు జరుపుతున్నారు. తాజాగా శ్రీలంక విమానాశ్రయం ప్రాంతంలో అమర్చిన ఓ పైపు బాంబును నిర్వీర్యం చేశారు. నిన్న ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లతో దేశవ్యాప్తంగా కర్య్పూ విధించిన ప్రభుత్వం దాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.

ఇంజనీరింగ్ యువతిపై అత్యాచారం.. సూసైడ్ లెటర్ రాయించి కిరాతకంగా హత్య!

ఇంజనీరింగ్ యువతిపై అత్యాచారం.. సూసైడ్ లెటర్ రాయించి కిరాతకంగా హత్య!

కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఘటన
యువతిని చెట్టుకు ఉరివేసి చంపిన నిందితుడు
ఆందోళనకు దిగిన స్థానికులు, యువత
కర్ణాటకలోని రాయచూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగుడు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాయచూర్ లోని నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి కొన్నిరోజుల క్రితం అదృశ్యమయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచూర్ లోని మానిక్ ప్రభు ఆలయం వద్ద ఓ యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు.. చనిపోయిన అమ్మాయి.. అదృశ్యమైన అమ్మాయి ఒక్కరేనని తేల్చారు.

తొలుత ఈ యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారనీ, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టారని పోలీసులు తెలిపారు. చివరగా యువతి చేత ఆత్మహత్య లేఖ రాయించి ఆమెను ఉరివేసి చంపేశారని పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై అరెస్ట్ చేయాలంటూ ప్రజలు వీధుల్లోకి రావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు సుదర్శన్ యాదవ్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంత మాట అంటారా? రాహుల్ ను కోర్టుకు లాగుతా: లలిత్ మోదీ

అంత మాట అంటారా? రాహుల్ ను కోర్టుకు లాగుతా: లలిత్ మోదీ

మోదీలంతా దొంగలేనన్న రాహుల్ పై కోర్టులో కేసు వేస్తా
ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకుంది గాంధీలే
నరేంద్రమోదీ, లలిత్ మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు దొంగ?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మండిపడ్డారు. దొంగలందరి పేర్ల చివరన మోదీ ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మోదీలందరూ దొంగలేనని పప్పు రాహుల్ గాంధీ అన్నారు. యూకే కోర్టులో రాహుల్ పై కేసు వేస్తా. ఆయనను కోర్టులకు లాగుతా. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకుంది గాంధీల కుటుంబమే’ అంటూ ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ, లలిత్ మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు దొంగ? ఎవరు కాపలాదారుడు? అని ప్రశ్నించారు.

2010లో లలిత్ మోదీ ఇండియాను విడిచి వెళ్లిపోయారు. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ తదితర కేసులు ఆయనపై ఉన్నాయి. లండన్ లో ఉన్న మోదీని భారత్ కు రప్పించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మోదీపై అంతర్జాతీయ వారంట్ ను విధించాలన్న భారత అభ్యర్థనను 2017 మార్చ్ లో ఇంటర్ పోల్ తిరస్కరించింది.

విశాఖలో రేవ్ పార్టీ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

విశాఖలో రేవ్ పార్టీ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

రుషికొండ బీచ్‌లో మాదకద్రవ్యాలతో రేవ్‌పార్టీ
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి యువతకు విక్రయం
పట్టుబడిన ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ‌ మత్తుపదార్థాలు
విశాఖపట్టణంలో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తూ దొరికిన వారిని విచారిస్తున్న పోలీసులు విస్తుపోతున్నారు. ఈ కేసులో సత్యనారాయణ అనే యువకుడిని ఆరిలోవ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 15 మందిని విచారించిన పోలీసులు వారు చెబుతున్న విషయాలు విని ఆశ్చర్యపోయారు. శనివారం రాత్రి రేవ్‌పార్టీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు యువకుల నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలు అయిన ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ‌లను స్వాధీనం చేసుకున్నారు.

వీటిని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిథిలిన్ డీఆక్సీ మిథైన్ ఫిటామిన్ (ఎండీఎంఏ), లైసర్జిక్ యాసిడ్ డై ఇథలమైడ్ (ఎల్ఎస్‌డీ)లను రుషికొండలో జరిగిన రేవ్ పార్టీలో యువతకు గ్రాము నాలుగు వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు తేలింది. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ కొకైన్, హెరాయిన్‌లకన్నా మత్తు కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. అరుదుగా ఉపయోగించే వీటిని విశాఖ యువత వినియోగించడం సంచలనంగా మారింది. నిజానికి విశాఖపట్టణంలో ఇలా బహిరంగంగా డ్రగ్స్‌తో రేవ్ పార్టీలు జరుపుకున్న సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

చేవెళ్ల సమీపంలో ఘోర ప్రమాదం... బుల్లితెర నటులు భార్గవి, అనూష మృతి!

చేవెళ్ల సమీపంలో ఘోర ప్రమాదం… బుల్లితెర నటులు భార్గవి, అనూష మృతి!

ఓ షూటింగ్ నిమిత్తం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లిన టీమ్, తిరుగుప్రయాణమై వస్తున్న వేళ, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన వీరి కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం చేవెళ్ల సమీపంలోని అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద జరిగింది.

ఓ సీరియల్ లో నటిస్తున్న వీరు షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, నిర్మల్‌ కు చెందిన భార్గవి (20), భూపాలపల్లి జయశంకర్‌ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) మరణించారు. కారు డ్రైవర్‌ చక్రి, వీరితో పాటు ప్రయాణిస్తున్న వినయ్‌ కుమార్‌ లకు తీవ్ర గాయాలు కాగా, వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు మోయినాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

దొంగ ఓట్ల కోసం 'కృత్రిమ వేళ్లు'.. అప్రమత్తమైన ఎన్నికల అధికారులు

దొంగ ఓట్ల కోసం ‘కృత్రిమ వేళ్లు’.. అప్రమత్తమైన ఎన్నికల అధికారులు

సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ముగి nసింది. ఇప్పుడు నేతలందరూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మరోవైపు, నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం కాస్మొటిక్ చేతి వేళ్లపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో కొందరు వీటిని ఉపయోగించే అవకాశం ఉందన్న వార్తలతో అప్రమత్తమైంది.

ప్రమాదాల్లో వేలు పోగొట్టుకున్న వారు సాధారణంగా ఈ కాస్మొటిక్ చేతి వేళ్లను వాడుతుంటారు. ఇవి అచ్చం నిజమైన వేళ్లలానే ఉంటాయి. గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు వీటిని ఈ ఎన్నికల్లో ఉపయోగించుకోవడం ద్వారా దొంగ వేట్లు వేసే అవకాశం ఉండడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. వీటిని ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్తే సిరా గుర్తును వాటిపైనే వేస్తారు. బయటకు వచ్చాక దానిని తొలగించి మరోసారి ఓటువేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ కాస్మొటిక్ వేళ్ల గురించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు సిరాగుర్తు వేసే ముందు వేళ్లను గట్టిగా పట్టుకుని వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

వేలానికి నీరవ్ మోదీ కార్లు.. టెస్ట్ డ్రైవ్ చేయడం కుదరదు!

వేలానికి నీరవ్ మోదీ కార్లు.. టెస్ట్ డ్రైవ్ చేయడం కుదరదు!

సరైన కండిషన్ లో ఉన్న కార్లు
మంచి ధర పలుకుతాయని భావిస్తున్న ఈడీ
వారం ముందు కార్లు పరిశీలించుకునే అవకాశం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్లలో కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి సంబంధించిన కార్లను వేలం వేయాలని ఈడీ నిర్ణయించింది. నీరవ్ మోదీకి 13 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్, పనామెరా, హోండా, టయోటా, ఇన్నోవా కంపెనీల కార్లున్నాయి. ఈ కార్లను ఏప్రిల్ 18న ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. వేలం నిర్వహించే బాధ్యతను ఈడీ అధికారులు మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్మెస్ టీసీ)కి అప్పగించారు.

ఈ వేలంలో పాల్గొనేవారు ముందుగా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. కార్లన్నీ సరైన కండిషన్ లో ఉండడంతో టెస్ట్ డ్రైవ్ కు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. అయితే, వేలం ప్రక్రియకు వారం రోజుల ముందు కార్లను పరిశీలించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఐటీ శాఖ నీరవ్ మోదీకి సంబంధించిన పెయింటింగ్స్ వేలం వేయడం ద్వారా రూ.54.84 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈడీ తనవంతుగా కార్ల వేలం వేస్తోంది.