Andhra Pradesh AP Cabinet Meet Amaravati

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా? పోతుందా?… శాసనసభలో నేడే బిల్లు!

అమరావతి…! ఆరేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పడిన కొత్త నగరం. ఈ నగరంలో ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తదితర భవనాలతో పాటు ప్రజల నివాసానికి ఎన్నో భవంతులు సిద్ధమవుతున్నాయి. కానీ ఇది నిన్నటి మాట.

పాలన వికేంద్రీకరణ పేరిట, మూడు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో చోట ఒక్కో విభాగాన్ని ఏర్పాటు చేయాలని, తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమరావతిలో భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తూ, గడచిన నెల రోజులకు పైగా నిత్యమూ ఆందోళనలు చేస్తున్నారు. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, తొలి రోజునే రాజధాని విభజన అంశంపై క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకుని, కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుండటంతో ఇప్పటికే అమరావతి అష్టదిగ్బంధమైంది.

రాజధాని, ముఖ్యంగా వెలగపూడి సచివాలయం, మందడం మీదుగా దారితీసే సీడ్ యాక్సెస్ రోడ్ తదితరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. అసెంబ్లీలో వైసీపీకి ఎదురు లేకపోయినా, మండలిలో నూతన బిల్లులను వ్యతిరేకించాలని విపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రజలు మొత్తం ఇప్పుడు శాసనసభవైపు చూస్తూ, ప్రభుత్వ వ్యూహం, అమరావతి భవిష్యత్ ఏంటన్న విషయాలపై చర్చించుకుంటున్నారు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే, రైతులు ఇచ్చిన భూముల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. వారిలో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

అయితే, తమ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతిస్తుందే తప్ప, పాలన వికేంద్రీకరణకు కాదని తెలుగుదేశం పార్టీ అంటోంది. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా, మిగతా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరినీ పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను నియంత్రించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సచివాలయ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మరెవరినీ బ్యారేజ్ పైకి అనుమతించడం లేదు.

ఇదిలావుండగా, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అధ్యయనం చేసేందుకు తమకు కనీసం వారం రోజుల సమయం కావాలని అసెంబ్లీలో డిమాండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధానిపై ఆ పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

విశాఖపట్నంలో కార్యనిర్వహణ, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసేసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అంశాలపై రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా, అవి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. వీటిని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ వ్యతిరేకిస్తుండగా, ప్రభుత్వం ఓ హై పవర్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.

హై పవర్ కమిటీ కూడా తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ కమిటీ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది. దీనిపై ఈ ఉదయం, వైఎస్ జగన్ నేతృత్వంలో సమావేశం కానున్న రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆపై హై పవర్ కమిటీ నివేదిక అసెంబ్లీకి రానుండగా, అమరావతి భవితవ్యం మరో రెండు రోజుల్లో తేలనుంది.
Tags: Amaravati Assembly,Jagan YSRCP,Chandrababu

Tirumala Tirupati Ladoo Free, Dharmareddy

తిరుమలలో భక్తులందరికీ ఉచిత లడ్డూ.. నేటి నుంచే అమలు!

తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, ఇకపై ఉచితంగానే భక్తుల చేతిలోకి రానుంది. స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ ఓ లడ్డూను ఫ్రీగా అందించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం, ఈ ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల నుంచి నడచి వచ్చిన 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూను ఇస్తున్నామని, ఇకపై ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

కాగా, అదనంగా లడ్డూలు కావాల్సిన వారికి ఒక్కో లడ్డూ రూ. 50పై ఎన్నయినా అందిస్తామని, అందుకు ఏర్పాట్లు జరిగాయని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు ఎల్పీటీ కౌంటర్లు పనిచేస్తుండగా, భక్తుల సౌకర్యం మేరకు వాటి సంఖ్యను 12కు పెంచామని ఆయన అన్నారు. లడ్డూల కొరత లేకుండా చూసేందుకు నిత్యమూ 4 లక్షల లడ్డులను సిద్ధం చేస్తామని తెలిపారు.
Tags: Tirumala Tirupati Ladoo Free, Dharmareddy

Andhra Pradesh AP Cabinet Meet Amaravati

ఏపీ కేబినెట్ మీటింగ్‌ నే

డు కాదు.. సోమవారమే!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. సమావేశాన్ని తొలుత ఈ నెల 20న నిర్వహించనున్నట్టు మూడు రోజుల క్రితమే మంత్రులకు సమాచారం అందింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నానికి తన నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ ఉంటుందని మంత్రులకు తెలియజేసింది. అయితే, రాత్రి కల్లా మళ్లీ ఈ నిర్ణయం మారిపోయింది. ముందుగా అనుకున్న ప్రకారమే సోమవారం ఉదయం 9 గంటలకే మీటింగ్ ఉంటుందని మళ్లీ మంత్రులకు సమాచారం అందించింది.

రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు మంత్రి మండలి ఆమోదిస్తే, దానిని గవర్నర్‌కు పంపి అనుమతి తీసుకుని రెండు గంటల్లోపే అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావడంలో హడావుడి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అందుకనే తొలుత శనివారమే కేబినెట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు.

అయితే, బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించి, మంత్రి మండలిలో ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో నిదానంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావించి మీటింగ్‌ను ముందుగా అనుకున్నట్టే సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించాలని నిర్ణయించి, ఆ మేరకు మంత్రులకు సమాచారం పంపారు.
Tags: Andhra Pradesh AP Cabinet Meet Amaravati

Jagan,Amaravati, Andhra Pradesh

ఏపీ సీఎం జగన్‌ నివాసంలో ‘రాజధాని’ హైపవర్ కమిటీ కీలక భేటీ

అమరావతి రాజధాని అంశంపై వచ్చిన నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఈ రోజు కీలక భేటీలో పాల్గొంటోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సీఎంతో కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

ఇటీవల రాజధాని విషయంపై జీఎన్‌ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేసింది. రాజధానిపై వచ్చిన పలు ప్రతిపాదనలపై సీఎంకు హైపవర్ కమిటీ ప్రజెంటేషన్‌ ఇస్తోంది. రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇటీవల కమిటీ నిర్ణయం తీసుకుంది.
Tags: Jagan,Amaravati, Andhra Pradesh

Janasena,BJP,Andhra Pradesh

కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేతల భేటీ

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో ఆయనను ఈ రోజు ఉదయం పలువురు జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో లక్ష్మీనారాయణతో జనసేన నేతలు చర్చించారు. ఆయనతో భేటీ ముగిసిన అనంతరం శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడడం శుభ పరిణామంగా భావిస్తున్నామని తెలిపారు.

ఏపీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పరిపాలన సాగించాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే సర్కారుపై తాము ఒత్తిడి తెస్తామని, రానున్న రోజుల్లో బీజేపీతో కలిసి సమస్యలపై పోరాడతామని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సంస్థల ఎన్నికల్లో తాము సత్తా చాటుతామన్నారు.
Tags: Janasena,BJP,Andhra Pradesh

Pawan Kalyan, Jana Sena, BJP GVL, Kanna Lakshminarayana

పొత్తా? విలీనమా?… జనసేన, బీజేపీ కీలక సమావేశం మొదలు!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలతో, జనసేన నేతల కీలక సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన సంగతి తెలిసిందే. జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి, పార్టీని అధికారానికి దగ్గరగా తీసుకుని వెళ్లాలని నడ్డా కోరినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పటికప్పుడు ఎటువంటి సమాధానాన్నీ చెప్పని పవన్ కల్యాణ్, 2024లో వచ్చే ఎన్నికల వరకూ కలిసి పని చేద్దామని కోరారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇరు పార్టీల భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు విజయవాడ వేదికైంది. జనసేన తరఫున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున కన్నా లక్ష్మీ నారాయణ, జీవీఎల్, సునీల్ దేవధర్ హాజరు కానున్నారు.

స్థానిక ఎన్నికల్లో పొత్తు, రాజధాని అంశం, ప్రజా సమస్యలపై ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలపై ఇరు పార్టీల మధ్యా చర్చలు జరగనున్నాయని తెలుస్తుండగా, బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయడం, అందుకు విధివిధానాలపై నేతలు మాట్లాడుకోనున్నారని జనసేనలోని ఓ వర్గం చెబుతోంది. నిన్న జీవీఎల్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు, అమరావతి అంశం మాత్రమే తమ అజెండా కాదని వ్యాఖ్యానించడం విలీనం ఊహాగానాలను మరింతగా పెంచింది. మొత్తానికి నేడు జరగనున్న జనసేన, బీజేపీ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags: Pawan Kalyan, Jana Sena, BJP GVL, Kanna Lakshminarayana

Pawan Kalyan Kakinada SP Warning

పవన్ కల్యాణ్ కు తూర్పు గోదావరి ఎస్పీ నయీమ్ అస్మీ హెచ్చరిక!

ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద ఘర్షణ
గాయపడిన జనవేన కార్యకర్తలకు నేడు పవన్ పరామర్శ
ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్న ఎస్పీ
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి వద్ద జరిగిన ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు నేడు నగరానికి రానున్న పవన్ కల్యాణ్, భారీ ర్యాలీని తలపెట్టి, అందుకు అనుమతించాల్సిందిగా పోలీసులను కోరారు. అయితే, పోలీసులు ఈ ర్యాలీకి అనుమతించలేదు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అందుకు విరుద్ధంగా ఏవైనా కార్యక్రమాలు చేపడితే, చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మీ హెచ్చరించారు. పవన్ ర్యాలీలు, సభలు లేకుండా నగరానికి రావచ్చని, తన పార్టీ కార్యకర్తలను పరామర్శించ వచ్చని అన్నారు. అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదర్శన నిర్వహిస్తే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా, నిన్నటి వరకూ న్యూఢిల్లీలో ఉన్న పవన్, ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు వచ్చి, గాయపడిన వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Tags: Pawan Kalyan Kakinada SP Warning

Cock Fight Sankranti Andhra Pradesh

పందెం రాయుళ్ల కొత్త మార్గం… సంక్రాంతి క్రీడా పోటీల పేరిట బరులు!

సిద్ధమైన కోడి పందాల బరులు
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట బరులు
కత్తి కడితే కేసులు తప్పవంటున్న పోలీసులు
పందెం రాయుళ్లు సిద్ధమైపోయారు. ఈసారి కాస్తంత తెలివిగా, కోడిపందాల బరులకు బదులు, ‘సంక్రాంతి క్రీడా పోటీలు’ అంటూ ప్లెక్సీలు ముద్రించి, అనధికారికంగా పందెం బరులను సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని గన్నవరం, తోట్లవల్లూరు, ఆత్కూరు, కంకిపాడు, నున్న తదితర ప్రాంతాల్లో పలు చోట్ల స్థలాలను శుభ్రం చేసి, భారీ టెంట్లు వేసి, చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు.

ఇక పోలీసులు, అధికారులు వీటి గురించి ఆరా తీస్తే, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్థలాన్ని చదును చేస్తున్నామని చెప్పడంతో, వారూ ఏమీ అనలేని పరిస్థితి. ఇక, కోడి పందాలు, జూదాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న అధికారులు, హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసినా, వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కత్తి కట్టి కోడి పందేలు నిర్వహిస్తే, ఐపీసీ సెక్షన్-11 కింద కేసులు నమోదు చేస్తామని, బరులు ఏర్పాటు చేయాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరని, ఇక్కడ కూడా సంప్రదాయ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు మాత్రమే నిర్వహించుకోవచ్చని అంటున్నారు.
Tags: Cock Fight Sankranti Andhra Pradesh

Andhra Pradesh,Telangana,Jagan KCR meeting

నేటి మధ్యాహ్నం ఏకాంతంగా భేటీ కానున్న జగన్-కేసీఆర్

  • మంత్రులు, అధికారులకు కూడా దూరం
    9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఉద్యోగుల బదలాయింపు వంటి వాటిపై చర్చ
    నాలుగో సారి భేటీ కానున్న సీఎంలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ నేటి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో ఏకాంతంగా భేటీ కానున్నారని, మంత్రులు, అధికారులు కూడా వారి వెంట ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరు 23న ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం, కేంద్ర సహకారం లేకపోవడం వంటి విషయాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. రాయలసీమకు నీళ్లందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలన్న జగన్ నిర్ణయంపై తెలగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో దీనిపైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర వాటిపై చర్చించనున్నట్టు సమాచారం.
Tags: Andhra Pradesh,Telangana,Jagan KCR meeting

Janasena,Jagan,Telugudesam,Twitter,Chandrababu

జగన్… మీకు ఆ దమ్ముందా?: జనసేన సవాల్

పృథ్వీరాజ్ తో రాజీనామా చేయించారు
ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించగలరా?
ట్విట్టర్ లో ప్రశ్నించిన జనసేన పార్టీ

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని నానా మాటలూ అన్న తన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే దమ్ము, సీఎం జగన్ కు ఉందా? అని జనసేన పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. “మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన పృథ్వీరాజ్ చేత రాజీనామా చేయించిన జగన్ రెడ్డికి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని చెప్పలేని బూతులతో దుర్భాషలాడి, కాకినాడలో అల్లర్లు చేయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించే దమ్ముందా?” అని ప్రశ్నించింది.
Tags: Janasena,Jagan,Telugudesam,Twitter,Chandrababu