నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ

రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి చూపించిందని తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ విమర్శించారు. శనివారం నాడు రాజోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడం ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరి అని, దానికి కూడా ఏదో ఘన కార్యం సాధించినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చి యువతను ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించడం ద్వారా నిరుద్యోగ సమస్య సమసి పోతుందని వైసీపీ ప్రచారం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వాలంటీర్ల ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని రమణ ఆరోపించారు. దీని వల్ల నిజమైన నిరుద్యోగ యువతకు ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు. తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బడ్జెట్ ప్రవేశ పెడుతున్నపుడు రాష్ట్ర ఆదాయ వనరులు ఏ మేరకు ఉన్నాయి.. ఏఏ శాఖలకు ఎంత కేటాయింపులు చేస్తున్నామనేది చెప్పుకోవాలని, కానీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఇక్కడ కూడా గత తెదేపా ప్రభుత్వం పై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళలో కేంద్రం నుండి తగిన సహకారం లేకున్నా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేల కోట్లు వెచ్చించి చంద్రబాబు ముందుకు నడిపించగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులన్నీ కుంటుపడ్డాయని రమణ విమర్శించారు. ప్రతి విషయంలోనూ గత ప్రభుత్వం పై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం మాని, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం పై దృష్టి సారించాలని రమణ సూచించారు. లేకుంటే ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *