తెలంగాణకు కొత్త సమస్య… కల్లు, మద్యం దొరక్క వింత ప్రవర్తనలు, ఆత్మహత్యలు!

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారు ముందు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. నిత్యమూ కల్లు, మందుకు అలవాటు పడిన వారు, ఇప్పుడు అవి దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఇందూరులో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా, నిజామాబాద్‌ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవ్యక్తి ఫిట్స్‌ వచ్చి మరణించాడు.

నగరంలోని సాయినగర్‌ కు చెందిన శకుంతల (65)కు నిత్యమూ కల్లు తాగడం అలవాటు. గత వారం రోజులుగా కల్లు అందుబాటులో లేకపోగా, రెండు రోజుల నుంచి పిచ్చిగా ప్రవర్తించిన ఆమె, శుక్రవారం రాత్రి ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్‌ తాగేసింది. దీన్ని గమనించిన ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మరణించింది.

ఇదే సమయంలో మద్యం తాగే అలవాటున్న శంకర్‌ (45) అనే వ్యక్తి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి ముదిరాజ్‌ వీధిలో ఉండే భూషణ్‌ అనే మరో వ్యక్తి, కల్లు లేక విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఫిట్స్‌ వచ్చి చనిపోయారని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కల్లు గీసుకుని, అమ్ముకోవడానికి తన టూ వీలర్ పై వస్తున్న బాలనర్సాగౌడ్‌ (72), రోడ్డుపై వేసివున్న చెట్ల కొమ్మలు, మొద్దులను దాటే క్రమంలో ప్రమాదానికి గురై మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

కాగా, తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి బానిసలు అయినవారు లక్షల్లో ఉన్నారు. వీరికి మరికొన్ని రోజులు మద్యం అందుబాటులో లేకుంటే, ఈ తరహా మరణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని సలహా ఇస్తున్నారు.
Tags: Telangana, Wines Toddy, Sucide, Lockdown

Andhra Pradesh , Guntur District, MLA, Corona Virus

గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఐసోలేషన్ కు తరలింపు

కరోనా సోకిందేమో అనే అనుమానాలతో గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే బావమరిది, ఆయన భార్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లొచ్చారు. వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయన ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. దీంతో, ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ కు తరలించారు. గుంటూరు సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లో ఎమ్మెల్యేకు, ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Andhra Pradesh , Guntur District, MLA, Corona Virus

Chandrababu, Corona Virus, India, Andhra Pradesh, Telugudesam, COVID-19

దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుందని అన్నారు. మొదట్లో విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితులయ్యారని, ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా సోకుతోందని వివరించారు. కరోనా వైరస్ కనీవినీ ఎరుగని విపత్తు అని, కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు.

ఇతర దేశాల్లో కరోనా కట్టడికి సత్ఫలితాలను ఇచ్చిన విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేతివృత్తుల వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.

Tags: Chandrababu, Corona Virus, India, Andhra Pradesh, Telugudesam, COVID-19

Pawan Kalyan, Janasena, Corona Virus, Donation, Andhra Pradesh

విరాళం ప్రకటించిన పవన్ ను అభినందించిన జనసేన నేతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కరోనాపై పోరాటానికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ను జనసేన నేతలు అభినందించారు. పవన్ నిర్ణయం కరోనా నివారణ చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పవన్ ఇవాళ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో నిరుపేదలు, రైతులు, కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎలా ఖర్చవుతున్నాయో గమనించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు.

Tags: Pawan Kalyan, Janasena, Corona Virus, Donation, Andhra Pradesh

India, Corona Virus, Positive

ఇండియాలో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు!

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి.

ఆపై ఆంధ్రప్రదేశ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 18, లడ్డాక్ లో 13, బీహార్ లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్ లో 8, చత్తీస్ గఢ్ లో 7, ఉత్తరాఖండ్ లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రికవరీల విషయంలో మహారాష్ట్ర, యూపీ, హర్యానాలు ముందున్నాయి. మహారాష్ట్రలో 25 మంది వ్యాధిగ్రస్తులు రికవరీకాగా, యూపీ, హర్యానాల్లో 11 మంది చొప్పున వ్యాధి నుంచి బయటపడ్డారు.

Tags: India, Corona Virus, Positive

జర్నలిస్టులను ఆదుకోవాలి

  • రూ. 50 లక్షల బీమా కల్పించాలి.
  • నెలకు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎపిఎంఎఫ్ విజ్ఞప్తి.

విజయవాడ, మార్చి 28: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తున్న జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఉపాధ్యక్షులు బోళ్ళ సతీష్ బాబు ఈ మేరకు శనివారం నాడు ఒక లేఖ రాశారు. కరోనాను కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా సదుపాయాన్ని ప్రకటించిన మాదిరిగానే ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కూడా బీమా సదుపాయాన్ని కల్పించాలని వారు కోరారు. అదే విధంగా జర్నలిస్టులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం, ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Corona is a burden to journalists

పేదలకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువుల పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, అయితే పలువురు జర్నలిస్టులకు రేషన్ కార్డులు లేవని, పేదరిక నిర్దారణకు ఎటువంటి పత్రాలు లేవని గుర్తు చేశారు. పలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలలో పని చేస్తున్న సిబ్బందికి తగిన వేతనాలు లేవని, అటువంటి కుటుంబాలు ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో చిన్న, మధ్యతరహా పత్రికల నిర్వహణకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యతరహా పత్రికలకు అడ్వర్టయిజ్మెంట్లను ఇవ్వడం లేదని, అయినప్పటికీ అనేక వ్యయ ప్రయాసలను తట్టుకుని పత్రికలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్యాకేజీ ప్రకటించాలని డిల్లీబాబు రెడ్డి, సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు.

కరోనాదెబ్బకు జర్నలిస్టుల బతుకు భారం కాబోతోంది. ప్రభుత్వం సహకారం అందించాలి, జర్నలిస్టులను వాడుకొని వదిలేయ ఒద్దని ప్రభుత్వానికి గట్టిగా చెప్పాలి. యూనియన్లకు అతీతంగా సమిష్టిగా ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజీ కోసం కృషి చేద్దాం. 1.జర్నలిస్టుల కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఆరు నెలలపాటు ఇవ్వాలి, 2.యితర అవసరాల నిమిత్తం నెలకు రూ.5,000 చొప్పున ఆరు నెలల పాటు జర్నలిస్టు భృతిఇవ్వాలి , 3.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షలు ఇన్సూరెన్స్ పథకంలోకి జర్నలిస్టులను తీసుకురావాలి…. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ టీీం, విశాఖపట్నం.

Sukumar

జన్మభూమికి దర్శకుడు సుకుమార్‌ ఆపన్న హస్తం

  • తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల విరాళం
  • సొంత గ్రామానికి రూ.5 లక్షల సాయం

రాజోలు: కన్నతల్లిని, జన్మభూమిని గౌరవించే వారు దైవంతో సమానం. కష్టాలలో ఉన్న ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయడం మహనీయతకు నిదర్శనం. ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరంగా కనిపించే ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ ఆపన్నులకు సహాయ హస్తం అందించారు. ప్రార్దించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
కరోనా వైరస్‌ మహమ్మారితో స్వీయ నిర్భంధంలో ఉన్న తన స్వగ్రామంలోని ప్రజలు ఉపాధి లేక అల్లాడుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకులు బండ్రెడ్డి సుకుమార్‌ తన స్వగ్రామం మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను అందజేశారు. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు బండ్రెడ్డి సుకుమార్‌ రూ.10 లక్షలను కరోనా కట్టడికిగాను విరాళంగా ఇచ్చారు.

ఈ సందర్భంగా బండ్రెడ్డి సుకుమార్‌ మాట్లాడుతూ తనని చూసి మరికొందరు ముందుకు వస్తారని, కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెప్పారు. తన మిత్రులకే కాదు, శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రావొద్దని కోరుకుంటున్నానన్నారు. డబ్బులు ఉండి ఏం జేస్తయి.. సార్‌ పనికొస్తయా? మనం చచ్చిపోతే.. డబ్బులు ఏం జేస్తరు.. నాలాంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూన్నా ” అని సుకుమార్‌ కోరారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. భారత్‌లో 700 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌ డౌన్‌ విధించింది. ఈ నేపథ్యంలో తన గ్రామంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, బండ్రెడ్డి శ్రీను, కనుమూరి సత్తిబాబురాజు, కనుమూరి బాంబురాజు, కనుమూరి బుల్లికఅష్ణ ,బలిశెట్టి పెద్దిరాజు, జిల్లెళ్ళ విజయకుమార్‌, జిల్లెళ్ళ నరసింహారావు, మేకల ఏసుబాబు, విప్పర్తి చిట్టిబాబు, నేరుడుమెల్లి కృష్ణపతిరావు, తాడి సత్యనారాయణ, కాకర పండు ,కడలి సుబ్బిశెట్టి, స్టూడియో వర్మ గ్రామస్తులు పాల్గొన్నారు.

మీడియాపై దాడులు శోచనీయం

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వూహాన్ నగరం నుండి మొదలైన కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాలకు వ్యాపించింది. దీని నివారణకు ఇప్పటి వరకు ఏ విధమైన మందులు లేవు. వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. జన సాంద్రత అధికంగా ఉండే భారతదేశంలో ప్రజలు స్వీయ గృహ నిర్భంధంలో ఉండడం వల్ల వ్యాధి ఒకరి నుండి మరొకరికి విస్తరించకుండా క్వారంటైన్, ఐసోలేషన్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు.

ఇది అభినందనీయం. అయితే ఇదే సమయంలో కరోనాకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ప్రజలకు వాస్తవాలు అందించడానికి మీడియా ప్రతినిధులు కూడా అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియా ప్రతినిధులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కవరేజికి సహకరిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో విశాలాంధ్ర బ్యూరో దయాసాగర్ పై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. అనంతపురంలో కవరేజి చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడులు చేశారు. గురువారం నాడు హనుమాన్ జంక్షన్ వద్ద జర్నలిస్టులపై పోలీసులు లాఠీలు జళిపించారు. ఇది చాలా శోచనీయం.

కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు తాజా సమాచారం అందించాలనే తాపత్రయంతో జర్నలిస్టులు కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయి. విధి నిర్వహణలో కరోనా సోకే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అయినా విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం పోలీసులు గమనించాలి. జర్నలిస్టుల విధి నిర్వహణకు సహకారం అందించాలి. 

– పి. డిల్లీబాబు రెడ్డి.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్.
– బోళ్ళ సతీష్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.

Corona Virus,Facts,Deaths,Recovery,Medicine

కరోనా గురించి భయం వద్దు… ఈ నిజాలు తెలుసుకుంటే ఆందోళన ఉండదు!

కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇది నిజమే. అయితే, భయాందోళనలు చెందాల్సిన అవసరం ప్రస్తుతం కనిపించడం లేదు. ఏదో జరిగిపోతుందన్న అనుమానాల కన్నా, ఈ వైరస్ ను ఎదిరించగలమన్న నమ్మకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కరోనాపై పోరాటంలో, ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే, వైరస్ వ్యాప్తిపై ఉన్న భయాలు తొలగిపోయాయి.

ఈ వైరస్ సుమారు 4.38 లక్షల మందికి సోకగా, సుమారు 19 వేల మంది మరణించారు. అంటే మరణాల సంఖ్య సుమారు 4 శాతమే. అంటే, వైరస్ సోకిన వారంతా మరణిస్తారని భావించాల్సిన అవసరం లేదు. కరోనా సోకిన వారిలో ఇప్పటికే లక్ష మందికి పైగా కోలుకున్నారు. మరింత మందికి నెగటివ్ వచ్చినా, ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉన్నారు.

భారత దేశ రాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీలో ఇంతవరకూ 30 కేసులు పాజిటివ్ రాగా, అందులో ఐదుగురు కోలుకున్నారు. బుధవారం నాటికి ఇండియాలోని కరోనా పాజిటివ్ కేసుల్లో 42 మంది డిశ్చార్జ్ అయ్యారు కూడా. ఇక కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలీలో మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నాడు 793 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ సంఖ్య ఆదివారం 651కి, సోమవారం 601కి తగ్గింది.

ఇక కరోనాకు ఇంతవరకూ మందు లేకపోయినా, ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం కరోనాపై ప్రభావం చూపుతోంది. ఈ మందును వాడవచ్చని ఐసీఎంఆర్ సైతం పేర్కొంది. ఇండియా కేంద్రంగా వాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే మానవులపైనా ప్రయోగాలకు తాము సిద్ధమని సంస్థ సీఈఓ పూనావాలా వెల్లడించారు. తాము ఇప్పటికే వైరస్ కు మందును కనుగొనే దిశగా ముందడుగు వేశామని అమెరికా ప్రకటించింది.

వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని కోరింది. పది ప్రైవేటు ల్యాబ్ లకు టెస్టింగ్ అనుమతులు ఇచ్చింది. శానిటైజర్లు, మాస్కుల ధరలు పెరగకుండా చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిధులకు సమస్య రాకుండా పలు కార్పొరేట్ సంస్థలు, హై నెట్ వర్త్ ఇన్డివిడ్యువల్స్, రాజకీయ నాయకులు తమవంతు సాయం చేస్తున్నారు.

మాస్క్ ల ఉత్పత్తిని రోజుకు లక్షకు పెంచినట్టు రిలయన్స్ వెల్లడించింది. రక్షణాత్మక సూట్ లను కూడా తయారు చేస్తున్నామని పేర్కొంది. ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనాన్ని ఇస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో ఉచిత భోజన సదుపాయాన్ని దగ్గర చేసింది.

ఇక ప్రజలు చేయాల్సింది ఒక్కటే. అదే సామాజిక దూరం. ఇదే కరోనా కట్టడికి ఔషధం. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేసి, సమర్థవంతంగా పనిచేస్తే, కరోనా మహమ్మారిని తరిమేయడం పెద్ద కష్టమేమీ కాబోదు.
Tags: Corona Virus,Facts,Deaths,Recovery,Medicine

Lockdown,Ap Government,Purchase Goods

నిత్యావసరాల కొనుగోలుకు ఏపీలో మినహాయింపు : లాక్ డౌన్ కట్టడిలో వెసులుబాటు

లాక్ డౌన్ కట్టడి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ప్రకటించింది. ముఖ్యంగా నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలు కోసం జనం ఎగబడిపోతుండడం చూసి అనవసర రద్దీని నివారించేందుకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలను సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్‌ రెడ్డి, ఆర్అండ్ బీ శాఖ కార్యదర్శి ఎం.కృష్ణ తదితరులు ఆయా జిల్లాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు.

వారు తెలిపిన వివరాల మేరకు… ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు, పాలవిక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో తమ నివాసిత ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోని దుకాణాల వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వెళ్లాలి. అయితే గుంపులుగా జనం కొనుగోళ్లకు ఎగబడకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

నిత్యావసరాల కొరత, లాక్ డౌన్ అమలు విషయంలో సమస్యలుంటే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. విదేశీయులు, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలపై నిఘా ఉంచాలి. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు వారి కుటుంబాలను ఐసోలేషన్ వార్డుల్లో ఉంచాలి. విదేశీయుల కదలికలు, వైద్య చికిత్సల సమాచారం తెలిస్తే 104 ద్వారా ప్రజలు కూడా తెలియజేయవచ్చు.

నిత్యావసరాల సరఫరా చేసే వాహనాలను తిరిగేందుకు అనుమతించాలి. రైతుబజార్లకు కూరగాయలు తరలించేందుకు, నిత్యావసరాలు తరలించేందుకు ఆర్టీసీ బస్సుల సేవలు అందుబాటులోకి తేనున్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ప్రజలకు తెలిసేలా చేయడంతోపాటు ఆ పట్టికలను రైతుబజార్లలో ఏర్పాటు చేయాలి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పక్కాగా నిషేధం అమల్లో ఉంటుంది.
Tags: Lockdown,Ap Government,Purchase Goods