జర్నలిస్టులకు రూ.25 వేలు సహాయం అందించాలి: డిల్లీబాబురెడ్డి

– సిఎం జగన్మోహనరెడ్డికి ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి డిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి
విజయవాడ, జూన్ 22: కోవిద్-19 సంక్షోభ నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు డిల్లీబాబు రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి అక్రిడేటెడ్ జర్నలిస్టుకు రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆ లేఖలో కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి, కోవిద్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా మొదటి వరుసలో నిలిచి పోరాడుతున్నారని డిల్లీబాబు రెడ్డి పేర్కొన్నారు. కరోనా సమాచార సేకరణలో, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయడంలో జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఆర్థిక సమస్యలను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి మరీ జర్నలిస్టులు విధి నిర్వహణలో ముందుకు సాగుతున్నారని డిల్లీబాబు రెడ్డి వివరించారు. కోవిద్-19 నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలను పరిశీలించి వారికి ఆర్థిక సహాయం అందించడానికి, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *