20 రోజుల్లో అధికారంలోకి వస్తా: జగన్

20 రోజుల్లో అధికారంలోకి వస్తా: జగన్

విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న జగన్.. తన చిన్నాన్నను గొడ్డలితో నరికి చంపారన్నారు. 20 రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు మూటలు పంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆయన ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మహిళలకు సూచించారు.

చంద్రబాబు మాటలను నమ్మి మోసపోవద్దని, ఆయనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ ఓ జిత్తులమారి నక్కతోనని జగన్ పేర్కొన్నారు. మోసం అంటే ఏంటో చంద్రబాబు దగ్గరే నేర్చుకోవాలని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు. పేదలకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన వైసీపీతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా జగన్ అభివర్ణించారు. కాగా, జగన్ తొలి రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట సభల్లో ప్రసంగించారు.
Tags: ys jagan mohan reddy, visakapatnam,election campaign in vizag, chandrababu naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *