హైదరాబాద్‌ను కుదిపేసిన వాన.. 111 ఏళ్ల తర్వాత కుంభవృష్టి!

  • నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు దంచికొట్టిన వాన
  • 1908 తర్వాత ఈ స్థాయిలో ఇదే తొలిసారి
  • ఏకమైన నాలాలు, చెరువులు, రోడ్లు

నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. గత 111 ఏళ్లలో సెప్టెంబరులో ఏనాడు కురవని స్థాయిలో వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా.. అనేలా కురిసిన ఈ కుంభవృష్టి నగరవాసులను బెంబేలెత్తించింది. ఏకబిగిన గంటల కొద్దీ కురిసిన వర్షంతో జనం వణికారు. వాహనదారులు బెంబేలెత్తారు. 1908 సెప్టెంబరు తర్వాత ఈ స్థాయిలో వాన కురవడం ఇదే తొలిసారి.

లోతట్టు ప్రాంతాలు మునిగాయి. నాలాలు, చెరువులు పొంగిపొర్లాయి. రహదారులు గోదారులయ్యాయి. ఇక, వాహనదారుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. రోడ్లపై నిలిచిన నీటిలో ద్విచక్రవాహనాలు మునిగిపోగా, కార్లు అద్దాల వరకు మునిగాయి. రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్‌లో 12 సెం.మీల వర్షం కురిసింది.

ఇక, అల్వాల్‌, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, అంబర్‌పేట్‌, బేగంపేట్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మూసాపేట్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో వర్షం కుమ్మి వదిలిపెట్టింది. రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్‌లో అత్యధికంగా 14.1 సెం.మీ. వర్షం కురిసింది. 1908 సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో వర్షం కురిసింది.

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిని ఆ బృందాలు ఎప్పటికప్పుడు తొలగించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి. ఇక, నగర మేయర్ బొంతు రామ్మోహన్ అర్ధరాత్రి వరకు జీహెచ్‌ఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *