Hyderabad, Police Stations, Border Problem

‘హద్దు’ మీరుతున్న పోలీస్ స్టేషన్ల వివాదం : ఫిర్యాదీలకు ఇబ్బందులు

మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ వాదన
అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితి
జీరో ఎస్ఎఆర్ విధానం అమల్లో ఉన్న తెగని వంచాయతీ
హైదరాబాద్ మహానగరం శివారుల్లోని పోలీస్ స్టేషన్ల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతుండడం ఫిర్యాదీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారికి తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ తిప్పిపంపుతుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిశ హత్య ఘటన సంర్భంలోనూ శంషాబాద్ పోలీసులపై ఇటువంటి ఆరోపణే వచ్చింది. దిశ తండ్రి ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదంటూ శంషాబాద్ ఆర్టీఐఏ, శంషాబాద్ రూరల్ పోలీసులు పట్టించుకోలేదని, పట్టించుకుంటే తన కుమార్తె బతికి ఉండేదని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వం జీరో ఎఫ్ ఐఆర్ విధానం అమల్లోకి తెచ్చింది. అయినా సరిహద్దు పంచాయతీలు కొనసాగుతుండడంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి వివాదాలు పలు వెలుగు చూస్తున్నాయి.

ఉదాహరణకు రాజేంద్రనగర్, నార్సింగి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల మధ్య వివాదం చదవండి. తెలంగాణ పోలీసు అకాడమీకి సమీపంలోని మంచిరేవుల రోడ్డు కూడలి (గేహౌండ్స్ రోడ్డు)లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతుంటాయన్న తీవ్ర ఆరోపణ ఉంది. ఈ కారణంగా చీకటి పడిందంటే చాలు అరాంఘర్ నుంచి శంషాబాద్ వెళ్లాలంటే వాహన చోదకులు వణికిపోతుంటారు.

జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గగన్‌పహాడ్ కు వెళ్లే దారిలో బుద్వేల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. వీటిపై ఫిర్యాదు చేస్తే అంతర్జాతీయ విమానాశ్రయం, రాజేంద్రనగర్, మైలార్ దేవిపల్లి పోలీసుల మధ్య సరిహద్దు పంచాయతీ మొదలవుతోంది. అలాగే, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ రోడ్డుకు సమీపంలోని హఫీజ్ బాబానగర్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

ప్రమాదం జరిగినప్పుడల్లా ఈ ప్రాంతం ఎవరి పరిధిలోకి వస్తుందంటూ కంచన్‌బాగ్, సంతోష్ నగర్, చాం ద్రాయణగుట్ట పోలీసుల మధ్య వివాదం నెలకొంటోంది. కొన్ని రోజుల క్రితం దారుషిపాలో ఓ హత్య జరిగింది. ఘటనా స్థలం ఎవరి పరిధిలోకి వస్తుందని డబీరు, మీర్ చౌక్ పోలీసులు తెగ మల్లగుల్లాలు పడ్డారు. రెండుగంటల అనంతరం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడలేదు.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లన్నింటి పరిధిలోనూ ఈ సమస్యలు ఉన్నాయి. ఒకే ప్రాంతం రెండు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి రావడమే ఈ జంఝాటానికి కారణం. చాలా గ్రామాల్లో రోడ్డు ఒక స్టేషన్ పరిధిలో, రోడ్డు పక్క ఇళ్లు మరో స్టేషన్ పరిధిలోకి వస్తున్నాయి.

ఉదాహరణకు చంచల్ గూడ మహిళల జైలు మాదన్న పేట పీఎస్ పరిధిలోకి, పురుషుల జైలు డబీర్‌పుర స్టేషనల పరిస్థితిలోకి వస్తాయంటే సమస్య ఎంత జటిలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తరచూ ఇలాంటి వివాదాల వల్ల ఇబ్బంది అని, అత్యవసర పరిస్థితుల్లో మరీ సమస్యని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్షేత్ర స్థాయి నిర్ధారణ జరిపి బోర్డులు ఏర్పాటుచేసి ఈ సమస్యకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు.
Tags: Hyderabad, Police Stations, Border Problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *