సీమ‌లో 15 మంది సిట్టింగుల‌కు నో ఛాన్స్‌?

సీమ‌లో 15 మంది సిట్టింగుల‌కు నో ఛాన్స్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపికపై దృష్టిపెడుతున్నాయి. ఆయా నేతల జ‌యాప‌జ‌యాల అవ‌కాశాల‌పై జోరుగా స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక గురించి తాజాగా ఆసక్తిక‌ర – సంచ‌ల‌న విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని.. ప్ర‌జల నుంచి తీవ్ర ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌బోర‌ని తెలుస్తోంది.

ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు మొండిచేయి చూప‌నున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 15 మంది రాయ‌ల‌సీమ వారేన‌ని స‌మాచారం. టికెట్ ద‌క్క‌ని నేత‌లు వీరేనంటూ కూడా సోష‌ల్ మీడియాలో, వార్తాసంస్థ‌ల్లో కొన్ని పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సీమ‌లో జిల్లాల వారీగా చూస్తే.. అనంత‌పురంలో పుట్ట‌ప‌ర్తి, క‌దిరి, గుంత‌క‌ల్‌, క‌ల్యాణ‌దుర్గం, శింగ‌న‌మ‌ల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

పుట్ట‌ప‌ర్తి నుంచి ప్ర‌స్తుతం మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న‌కు ఈ ద‌ఫా టికెట్ వ‌చ్చే అవ‌కాశాలే లేవ‌ట‌. శింగ‌న‌మ‌ల‌లో యామినీ బాల‌కు కూడా మొండిచేయి ఖాయ‌మ‌ట‌. కాంగ్రెస్ నుంచి శైల‌జానాథ్ ను పార్టీలోకి ర‌ప్పించి ఆయ‌న్ను శింగ‌న‌మ‌ల‌లో పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గుంత‌క‌ల్ శాస‌న‌స‌భ్యుడు జితేంద్ర గౌడ్‌, క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రిల‌కు కూడా ఈసారి టీడీపీ జాబితాలో చోటు ద‌క్క‌బోద‌ట‌.

చిత్తూరులో ఫిరాయింపు మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణమ్మ‌కు కూడా టికెట్ ద‌క్క‌ద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చిత్తూరు, తంబళ్ల‌ప‌ల్లె, స‌త్యేవేడు నియోజ‌క‌వ‌ర్గాల సిట్టింగ్ ల‌కు కూడా నిరాశే ఎదురుకానుంద‌ని స‌మాచారం.

క‌ర్నూలులో భూమా కుటుంబానికి భారీ షాక్ త‌గిలే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో మంత్రి అఖిల‌ప్రియ‌, నంద్యాల‌లో ఆమె సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద రెడ్డి, క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహ‌న్ రెడ్డిల‌కు టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ట‌. ప‌త్తికొండ‌లో తాను త‌ప్పుకొని కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాల‌ని ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి భావిస్తున్నారు. అయితే – కేఈని చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టీడీపీ అంత‌ర్గ‌త వ‌ర్గాలు చెబుతున్నాయి. కేఈ త‌మ్ముడు ఆశిస్తున్న డోన్ సీటును కూడా వేరే వాళ్ల‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌.

క‌డ‌ప‌లో జ‌మ్మ‌లమడుగు స్థానంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఫిరాయింపు మంత్రి ఆదికి అవ‌కాశ‌మివ్వాలా లేక రామ‌సుబ్బారెడ్డికి ఛాన్సివ్వాలా అనే విష‌యంపై సీఎం క‌స‌ర‌త్తులు కొన‌సాగిస్న్నార‌ట‌. మ‌రి ఇంత భారీ సంఖ్య‌లో సిట్టింగుల‌కు చంద్ర‌బాబు సీట్లు నిరాక‌రిస్తే వారు ఊరుకుంటారా? లేక రెబ‌ల్స్ గా బ‌రిలో దిగుతారా? వేరే పార్టీల్లో చేర‌తారా అనే విష‌యాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *