సినీ నటి విజయనిర్మల బర్త్ డే వేడుక.. కేక్ తినిపించిన సూపర్ స్టార్ కృష్ణ

సినీ నటి విజయనిర్మల బర్త్ డే వేడుక.. కేక్ తినిపించిన సూపర్ స్టార్ కృష్ణ

ప్రముఖ నటి, దర్శక- నిర్మాత విజయనిర్మల తన 74వ పుట్టినరోజు వేడుకలను నేడు జరుపుకున్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని ఆమె నివాసంలో అభిమానుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో విజయనిర్మల భర్త, ప్రముఖ నటుడు కృష్ణ, సీనియర్ నటి జయసుధ, సీనియర్ నటుడు నరేశ్, నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు, నిర్మాత బి.ఎ.రాజు, మా’ అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనిర్మలకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం, విజయనిర్మల మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. అభిమానుల అభిమానమే తన ఆయుష్షు అని, వారి మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం తన కెంతో సంతోషంగా ఉందని అన్నారు.

అంతకుముందు, కృష్ణ మాట్లాడుతూ, అభిమానుల వల్లే తాము ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామని అన్నారు. విజయనిర్మల మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుతున్నానని ఆకాంక్షించారు.
కాగా, తన తల్లి విజయనిర్మల ప్రతి ఏటా ‘మా’ అసోసియేషన్ కు విరాళం ఇస్తారని, అదే విధంగా ఈ ఏడాది కూడా రూ.74,000 అందజేశారని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. పుల్వామా వీర జవాన్ల కుటుంబానికి తమ కుటుంబం తరపున లక్ష రూపాయల చెక్కును అందజేసినట్టు చెప్పారు. ప్రతి ఏటా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహాయసహకారాలు అందజేస్తున్న తన తల్లి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నరేశ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *