వెన్నుపోటుకు ముందుపోటు

వెన్నుపోటుకు ముందుపోటు

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో తెలుగు చిత్రసీమలో ప్రకంపనల్ని సృష్టిస్తున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఆగమనం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి జరిపిన కుట్ర నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తున్న వర్మ తాజాగా ప్రేమికులరోజును పురస్కరించుకొని ఈ నెల 14న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇది కుటుంబ కుట్రల చిత్రం అనే క్యాప్షన్‌తో వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ట్రైలర్‌కు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృతజ్ఞతలేని కుటుంబం, అవిశ్వాసపాత్రులైన అనుచరులు, వెన్నుపోటుదారుల నడుమ సాగిన ఓ గొప్ప ప్రేమకథ ఇది. లక్ష్మీపార్వతి కోసం ఎన్టీఆర్ తన కుటుంబాన్ని, పార్టీని ధిక్కరించారు. ఎన్నో రహస్యాలు దాచుకున్న ప్రణయమిది. ఇరవై ఏళ్లుగా నిస్తేజంగా ఉన్న నిజాలకు ఓ మేలుకొలుపు. కోట్లాది ప్రజల ఆరాధ్యుడిగా జేజేలందుకొని, గుప్పెడు మంది చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ జీవితంలోని తెలియని కోణాల్ని, నిగూఢమైన రహస్యాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం.

ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి అనుబంధంలో అందరికి తెలిసిన విషయాలతో పాటు వారి మధ్య పెనవేసుకుపోయిన గాఢమైన ప్రేమ మర్మమేమిటో కూడా ఇందులో ఆవిష్కరించబోతున్నాం. ఈ కథ వివాదాస్పదమైనది. నిజాలు ఎప్పటికీ సమాధిలోనే ఉండిపోవాలని కోరుకునే కొంతమంది వ్యక్తులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ తెలుగు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన కథ ఇది. చివరి రోజుల్లో ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగింది? ఆయన పట్ల విధి ఎంత నిర్దయ చూపింది? అనే ప్రశ్నలకు సమాధానాల్ని చెబుతున్నాం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వారందరికి ఈ సినిమా ముందుపోటులా వుంటుంది. అవిశ్వాసులు, కుట్రదారులపై ఝుళిపించే నిజాల కత్తి ఇది. గతాన్ని నిజాలతో కడిగి వర్తమానం ముందుంచే ప్రయత్నం. ఎందరో జీవితాల్లో వెలుగునింపిన ఓ వ్యక్తి చుట్టూ ముసిరిన చీకట్ల తాలూకు వ్యథల్ని ఆవిష్కరించే గాథ అంటూ రామ్‌గోపాల్‌వర్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న ఉదయం ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్మీ, సంగీతం: కల్యాణ్ కోడూరి, నిర్మాతలు: రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *