మిస్ట‌ర్ క్లీన్ టీడీపీలోకి...కాంగ్రెస్‌కు షాక్‌

వీసా ఫ్రాడ్ కేసు…అమెరికాకు భార‌త్ కీల‌క విజ్ఞ‌ప్తి

పే టూ స్టే స్కీమ్‌ కింద ఫర్మింగ్టన్‌ వర్సిటీలో జ‌రిపిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో అరెస్టు చేసిన 129 మంది విద్యార్థుల విష‌యంలో భార‌త్ కీల‌క ప్ర‌తిపాద‌న‌ను అగ్ర‌రాజ్యం అమెరికా ముందు ఉంచింది. ఫర్మింగ్టన్‌ ఫేక్‌ వర్సిటీ కేసులో 129 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు అయ్యారు. విద్యార్థులకు ఫేక్‌ వీసాలు ఇప్పించిన 8 మంది దళారీలను కూడా అరెస్టు చేశారు. ఇదే కేసులో ఓ పాలస్తీనా విద్యార్థి కూడా అరెస్టు అయ్యాడు.

హోమ్‌ల్యాండ్‌ పోలీసులు జరిపిన అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో నకిలీ వీసాల కేసు బయటపడిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుల‌ నేప‌థ్యంలో విద్యార్థుల కోసం భారత్‌ ఓ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను కూడా తెరిచిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలో అరెస్టు అయిన విద్యార్థుల‌ను విడుదల చేయాలని అమెరికాను భారత్‌ అభ్యర్థించింది. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు అమెరికాకు లేఖ రాసింది. భారతీయ విద్యార్థుల క్షేమమే మా ప్రాధాన్య‌త‌ అని పేర్కొన్నది. అయితే ఆ విద్యార్థులను డిపోర్ట్‌ చేయరాదంటూ కూడా అగ్రరాజ్యాన్ని భారత్‌ కోరింది.

పే టూ స్టే స్కీమ్‌ కింద ఫర్మింగ్టన్‌ వర్సిటీలో సుమారు 600 మంది విద్యార్థులు అక్రమ పద్ధతిలో తమ పేర్లను నమోదు చేసుకోగా వారిలో 129 మంది అరెస్ట్ అయ్యారు. సివిల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఆరోపణలపై విద్యార్థులను అరెస్టు చేసిన ఘటన పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో 8 మందిపై నేరారోపణ కింద విచారణ మొదలుపెట్టారు. అయితే మిగితా 129 మంది విద్యార్థులపై మాత్రం క్రిమినల్‌ చార్జ్‌లు చేయలేదు. అందుకే వాళ్లను మరోవిధంగా చూడాలని భారత్‌ తన ప్రకటనలో కోరింది.

చాలా మంది విద్యార్థులు అక్కడే పనిచేస్తున్నారని, మరికొందరు మాస్టర్స్‌ డిగ్రీ కోసం చదువుతున్నారని భారత్‌ తన లేఖలో వెల్లడించింది. అయితే అరెస్టు అయిన విద్యార్థులు పూర్తి వివరాలను వెల్లడించాలని అమెరికాను ప్రభుత్వం కోరింది. డిటెన్షన్‌ సెంటర్ల నుంచి వాళ్లను వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులను డిపోర్ట్‌ చేయకూడదంటూ ఓ ప్రకటనలో భారత్‌ కోరింది.

కాగా, యూనివర్సిటీ అక్రమ పద్ధతిలో నడుస్తోందని తెలిసే విద్యార్థులు దాంట్లో చేరారని ఫెడరల్‌ అధికారులు అంటున్నారు. ఉద్యోగం చేసుకునే వీలును కల్పించే వర్సిటీల్లో విద్యార్థులు చేరుతుంటారని మరోవైపు కౌన్సులర్లు వాదిస్తున్నారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందిని మిచిగన్‌లోని కల్‌హౌన్‌ కౌంటీ జైలులో బంధించారు. భారత్‌కు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఇప్పటివరకు విదేశాంగ ఏర్పాటు చేసిన కౌన్సులర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

పూర్తి స్థాయి కోర్సులో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోకపోవడం వల్లే వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చిందని హోమ్‌ల్యాండ్‌ పోలీసులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం డెట్రాయిట్‌ కోర్టులో అరెస్టు అయిన 8 మంది దళారీలను ప్రజెంట్‌ చేయనున్నారు. మిగితా 130 మంది కూడా త్వరలోనే ఇమ్మిగ్రేషన్‌ జడ్జీల ముందు హాజరుకానున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త రానుంద‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *