విశాఖలో రేవ్ పార్టీ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

విశాఖలో రేవ్ పార్టీ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

రుషికొండ బీచ్‌లో మాదకద్రవ్యాలతో రేవ్‌పార్టీ
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి యువతకు విక్రయం
పట్టుబడిన ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ‌ మత్తుపదార్థాలు
విశాఖపట్టణంలో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తూ దొరికిన వారిని విచారిస్తున్న పోలీసులు విస్తుపోతున్నారు. ఈ కేసులో సత్యనారాయణ అనే యువకుడిని ఆరిలోవ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 15 మందిని విచారించిన పోలీసులు వారు చెబుతున్న విషయాలు విని ఆశ్చర్యపోయారు. శనివారం రాత్రి రేవ్‌పార్టీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు యువకుల నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలు అయిన ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ‌లను స్వాధీనం చేసుకున్నారు.

వీటిని ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిథిలిన్ డీఆక్సీ మిథైన్ ఫిటామిన్ (ఎండీఎంఏ), లైసర్జిక్ యాసిడ్ డై ఇథలమైడ్ (ఎల్ఎస్‌డీ)లను రుషికొండలో జరిగిన రేవ్ పార్టీలో యువతకు గ్రాము నాలుగు వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు తేలింది. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ కొకైన్, హెరాయిన్‌లకన్నా మత్తు కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. అరుదుగా ఉపయోగించే వీటిని విశాఖ యువత వినియోగించడం సంచలనంగా మారింది. నిజానికి విశాఖపట్టణంలో ఇలా బహిరంగంగా డ్రగ్స్‌తో రేవ్ పార్టీలు జరుపుకున్న సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *