‘విక్రమ్‌’డు కథ ప్రస్తుతానికి ముగిసినట్టే… మరో 14 రోజులు వేచి చూశాకే ఏదైనా!

  • ఈరోజుతో చంద్రుడిపై పూర్తయిన లూనార్‌ పగలు
  • రెండు వారాలపాటు చీకటిలో దక్షిణ దృవం
  • ఈ కాలంలో ఎటువంటి పరీక్షలు సాధ్యం కాదు

చీకటిలో చిరు దీపంలా ఎక్కడో చిన్న ఆశ. చంద్రుడి దక్షిణ దృవంపైకి భారత్‌ పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ కోసం అవిశ్రాంత వెతుకులాట ఫలితమిస్తుందన్న ఆశావాదం. కానీ ఇస్రో ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. దీంతో మనం పంపిన అంతరిక్ష వ్యోమనౌక విక్రమ్‌డి కథ ముగిసినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్‌-2లో భాగంగా జూలై 22న చంద్రునిపైకి భారత్‌ ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ అన్ని దశలు దాటుకుని విజయవంతంగా చంద్రుని సమీపంలోకి చేరింది. ఈనెల 7వ తేదీన చివరి ఘట్టమైన ల్యాండింగ్‌ ప్రక్రియలో మరో 2.1 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి చంద్రునిపై నిర్దేశిత ప్రాంతంలో దిగివుంటే అదో చారిత్రక అడుగు అయ్యేది. అక్కడే మన ల్యాండర్‌ దారితప్పి చంద్రుడిపై ఫోర్స్‌ ల్యాండింగ్‌ అయ్యింది. మనతో సంబంధాలు తెంచుకుంది.

దీంతో ల్యాండర్‌ను వెతికి పట్టుకుని చివరి సెకన్లలో చేజారిన విజయాన్ని చేజిక్కించుకునేందుకు, వైఫల్యాన్ని వెతికి పట్టుకునేందుకు ఇస్రో చేసిన ఏ ప్రయత్నం ఫలితం ఇవ్వలేదు. మన ఆశలు అడియాశలు అయ్యాయి. ఆర్బిటర్‌లోని కెమెరాల ద్వారా ఫొటోలు తీసిన శాస్త్రవేత్తలు ల్యాండర్‌ బలంగా చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిందన్న నిర్ధారణకు వచ్చారు. విక్రమ్‌లోని ‘ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ ప్రొగ్రామ్‌’ లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.

కనీసం 200 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌ చంద్రుడిని ఢీకొట్టి నిర్వీర్యమైంది. వ్యోమనౌక బోల్తా కొట్టడంగాని, పక్కకు ఒరిగి పడిపోవడంగాని జరిగి ఉంటుందని, అందుకే కమ్యూనికేషన్‌ సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నారు.  చంద్రుడిపై ఈరోజు ఉదయంతో లూనార్‌ పగలు ముగిసింది. దీంతో మరో 14 రోజులపాటు దక్షిణ దృవంపై చీకటి పరుచుకుంటుంది. పైగా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీలకు పైనే నమోదవుతాయి.

ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి విక్రమ్‌ ల్యాండర్‌, అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌లకు లేదు. దీంతో దీని కథ ముగిసినట్టే అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. మళ్లీ 14 రోజు తర్వాత లూనార్‌ పగలు మొదలయ్యాక ఆర్బిటర్‌ కెమెరా నుంచి పరిశీలించి విక్రమ్‌ జాడ కనుక్కునే ప్రయత్నం చేసినా అప్పటికే అది నిర్వీర్యమై ఉంటుంది కావున ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు.

Tags: ISRO, Vikram Lander, Lunar Night, chandrayaan2, nasa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *