రీపోలింగ్ ఎఫెక్ట్: ఓట్లు వందల్లోనే అయినా... సర్వశక్తులూ ఒడ్డేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధం!

రీపోలింగ్ ఎఫెక్ట్: ఓట్లు వందల్లోనే అయినా… సర్వశక్తులూ ఒడ్డేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధం!

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో, ఇక్కడున్న ఓటర్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని, మెజారిటీ స్వల్పంగానే ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో, ఈ పోలింగ్ బూత్ లలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను సంపాదించుకోవాలని అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు వ్యూహాలను రచిస్తున్నాయి.

నరసరావుపేట పరిధిలోని కేసనపల్లి – 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, గుంటూరు వెస్ట్ పరిధిలోని నల్లచెరువు – 244వ పోలింగ్‌ బూత్, కోవూరు పరిధిలోని పల్లెపాలెం, ఇసుకపల్లి – 41వ పోలింగ్‌ బూత్, సూళ్లూరుపేట పరిధిలోని అటకానితిప్ప-197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతల – 247వ పోలింగ్‌ బూత్‌ లో రీపోలింగ్ జరగనుంది. దీంతో ఈ ఐదు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు రీపోలింగ్ జరిగే బూత్ ల పరిధిలోని ఓటర్లపై దృష్టిని సారించారు.

నర్సరావుపేట నుంచి టీడీపీ తరఫున డాక్టర్‌ అరవిందబాబు, వైఎస్సార్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా, గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ తరపున మద్దాల గిరి, వైఎస్సార్సీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం బరిలో ఉన్నారు. కోవూరు నుంచి తెలుగుదేశం తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, సూళ్లూరుపేటలో టీడీపీ తరఫున పరసా వెంకటరత్నం, వైసీపీ తరఫున కిలివేటి సంజీవయ్య, యర్రగొండపాలెం (ఎస్టీ) నుంచి టీడీపీ తరఫున బుదల అజితారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బరిలోకి దిగారు.

వీరితో పాటు జనసేన, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే ఉంది. అభ్యర్థులంతా తమతమ ప్రధాన అనుచరులను రీపోలింగ్ జరిగే గ్రామాలకు పంపి, అక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని సమాచారం. ఈ బూత్ ల పరిధిలో ఒక్కో ఓట్ కు 10 వేల రూపాయల వరకూ ఇస్తున్నారని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఒక్కో బూత్ లో ఓటర్ల సంఖ్య వందల్లోనే ఉన్నప్పటికీ, గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *