రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్న సంజయ్ దత్!

బాలీవుడ్‌ నటుడు, అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో జైలు శిక్షను కూడా అనుభవించిన సంజయ్ దత్, మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 25న సంజయ్, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్ (ఆర్ఎస్పీ)లో చేరనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వ్యవస్ధాపకులు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్‌ జంకర్‌ స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ఎస్పీ కూడా భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా 2009లో లక్నో లోక్‌ సభ స్థానం నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా నిలబడిన సంజయ్‌ దత్‌, ఆపై దోషిగా తేలడంతో తన నామినేషన్‌ ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. 2019 ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్న ఆయన, తదుపరి జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
Tags: Sanjay Dutt, RSP, Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *