యాదాద్రిలో మహా సుదర్శన యాగం తలపెట్టిన కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరో మహా యాగానికి సమాయుక్తులవుతున్నారు. దీనికి లక్ష్మీ నరసింహుడు కొలువైన యాదాద్రి వేదిక కానుంది. నిన్న త్రిదండి చినజీయర్ స్వామిని కేసీఆర్ స్వయంగా కలిసి యాగంపై చర్చించారు. మహా సుదర్శన యాగ విశిష్టతను కేసీఆర్ కు చినజీయర్ స్వామి వివరించారు. ఈ యాగం దాదాపు 100 ఎకరాల్లో జరుగుతుంది. మొత్తం 1,048 యజ్ఞ కుండాలను నిర్మిస్తారు. మొత్తం 3 వేల మంది రుత్విక్కులు, వారికి సహాయకులుగా మరో 3 వేల మంది యాగ నిర్వహణలో ఉంటారు.

ఈ యాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని, ఇండియాలోని అన్ని రాష్ట్రాల సీఎంలను, గవర్నర్ లను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, మత గురువులను, ఇతర ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు రెండున్నర గంటల పాటు చినజీయర్ తో చర్చలు జరిపిన కేసీఆర్, యాదాద్రి ప్రారంభోత్సవంపైనా మాట్లాడారు. శ్రావణ మాసం ముగిసేలోగా యాదాద్రి పనులు పూర్తవుతాయని, ఆపై శుభముహూర్తం చూసి ఆలయాన్ని మహా వైభవంగా ప్రారంభిద్దామని కేసీఆర్ స్వామికి తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని, ప్రధానాలయంలో కవచమూర్తుల ప్రతిష్ఠ తదితర అంశాలపైనా ఇరువురి మధ్యా చర్చలు సాగాయి.

కాగా, మహా సుదర్శన యాగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, భద్రీనాథ్‌, శ్రీరంగం, తిరుపతి తదితర క్షేత్రాల మఠాధిపతులను ఆహ్వానించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున, ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసేందుకు చేయాల్సిన విస్తృతమైన ఏర్పాట్లపైనా ఇరువురూ చర్చించారు.
Tags: Kcr Telangana, Maha Sudarshana Yagam,Chinajeeyar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *