యాదాద్రికి విశ్వఖ్యాతి

అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, విశ్వఖ్యాతిని గడించేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. యాదాద్రి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం దేశంలో ఎక్కడా చేయనివిధంగా 1008 హోమగుండాలతో ప్రపంచంలో, దేశం నలుమూలల్లో ఉన్న శ్రీవైష్ణవ సంప్రదాయం పాటించే పెద్దలతో నిర్వహిస్తామని తెలిపారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో బద్రినాథ్ వైష్ణవ పండితులతోపాటు 133 దేశాలనుంచి వైష్ణవ పండితులు ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి తరలివస్తామని లేఖలు రాశారని వివరించారు. 6,500 మంది రుత్వికులు ఏకకాలంలో వేదపఠనం చేస్తారని, వారి సహాయకులే దాదాపు రెండుమూడు వేల మంది ఉంటారని తెలిపారు. పునఃప్రతిష్ఠాపన సమయంలో ఐదు లక్షల నుంచి 15 లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఓ కార్యకర్తలా తానే దగ్గరుండి జరిపిస్తానని అన్నారు. ఆలయ నిర్మాణం ప్రపంచదేశాలు అబ్బురపడేలా, వెయ్యేండ్లు గుర్తుండేలా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రారంభం, అప్పుడు ప్రారంభం అంటూ మీడియా, పత్రికాసోదరులు వార్తలు రాయవద్దని కోరారు.

ఇంత పెద్ద గొప్పకార్యం రెండుమూడు నెలల్లో పూర్తయ్యేదికాదన్న కేసీఆర్.. ఎప్పుడు ప్రారంభమవుతుందో స్వయంగా తానే వచ్చి చెప్తానని, అప్పటివరకు ప్రారంభోత్సవంపై ఎలాంటి వార్తలు రాయొద్దని సూచించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను ఆదివారం వైడీటీఏ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మళ్లీ పది పదిహేను రోజుల్లో యాదాద్రి సందర్శనకు వస్తానని చెప్పారు. తొలుత యాదాద్రిపై హెలికాప్టర్‌లో విహంగవీక్షణం చేశారు. కొండపై మహారాజ గోపురాలు, ప్రాకారాలను అణువణువు పరిశీలించారు. అనంతరం పెద్దగుట్టపై నిర్మాణమవుతున్న టెంపుల్‌సిటీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేవలం శని, ఆదివారాల్లోనే 70 వేలమంది భక్తులు వస్తున్నారంటే ఈ ఆలయానికి ఎంత మహిమ ఉందో అర్థమవుతున్నదన్నారు. ఇంత గొప్పక్షేత్రం సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. మన ఆలయాలను, సంస్కృతిని, సంస్కారాన్ని కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నామని తెలిపారు. యాదాద్రి దేవాలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గొప్పగా నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు.

విస్తరణ పనుల్లో మరింత వేగం
ఆలయ విస్తరణ పనుల్లో వేగం మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. మండపాలు, గోపురాలు, పురవీధుల పనులు అద్భుతంగా ఉన్నాయన్నారు. గాలిగోపురం పూర్తిగా శిలలతోనే నిర్మిస్తున్నామని వివరించారు. శివాలయం, గర్భాలయం, మండప నిర్మాణంతోపాటు అన్ని ప్రాంతాల్లో కృష్ణ శిలలను వాడుతున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యాక అద్భుతమైన దివ్యక్షేత్రంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం భక్తులకు సాక్షాత్కారం అవుతుందని తెలిపారు. ఆలయ విస్తరణ పనులకు 173 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని, ఇందుకు రూ.70 కోట్లు మంజూరుచేశామని సీఎం చెప్పారు. ఇందులో ఉత్తరభాగంలో ఆలయ కిందివైపు 30 ఎకరాలు గండిచెరువు కింద ఉన్నదని, ఈ చెరువును స్వామివారి తెప్పోత్సవానికి ఉపయోగిస్తామని వెల్లడించారు. జూన్‌లో కాళేశ్వరం నుంచి యాదాద్రి కొండ కింద యాదగిరిపల్లిలో ఉన్న గండిచెరువులోకి స్వచ్ఛమైన నీళ్లు వస్తాయని చెప్పారు. చెరువుల చుట్టు చెట్లు, లైట్లతోపాటు రోడ్డుతో అందంగా తీర్చిదిద్దుతామని, స్వచ్ఛమైన నీటితోకూడిన గండిచెరువును స్వామివారి తెప్పోత్సవానికి ఉపయోగిస్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *