మోదీ అనుమతితోనే కుట్రలు అమలు

మోదీ అనుమతితోనే కుట్రలు అమలు

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుమతితోనే తమ ప్రభుత్వ కూల్చివేతకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి కొన్ని గంటల ముందు హడావుడిగా కుమారస్వామి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యడ్యూరప్ప ప్రయత్నిస్తున్న ఆడియో రికార్డులను విడుదలచేశారు. స్పీకర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు యడ్యూరప్ప రూ.50 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారని పేర్కొన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్‌గౌడకు డబ్బుతోపాటు ఇతర ప్రయోజనాలు చేకూరుస్తామని ఆయన కుమారుడు శరణ్‌గౌడకు యడ్యూరప్ప ఫోన్ చేశారని.. తండ్రి మనస్సు మార్చమని కోరారని చెప్పారు. ప్రధానికి తెలియకుండా ఇది సాధ్యమేనా? అని కుమాస్వామి ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతున్నదన్నారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని మోదీ రుజువు చేసుకోవాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ ఆడియో రికార్డులను ప్రధానికి పంపుతానని, దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య స్పందిస్తూ ఆడియో రికార్డుల్లో ఉన్నది యడ్యూరప్ప గొంతేనని, దీన్ని తాము ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపుతామన్నారు.

గైర్హాజరైన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్ జారీ

గత నెల 18న సీఎల్పీ భేటీకి గైర్హాజరైన నలుగురు ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసేందుకు వీలుగా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. మరో ఇద్దరు అనుమతితోనే సమావేశానికి హాజరు కాలేదని సిద్దరామయ్య చెప్పారు. సహచర ఎమ్మెల్యేపై దాడి కేసులో సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ కూడా సభకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేయాలని స్పీకర్ రమేశ్‌కుమార్‌ను సిద్దరామయ్య కోరారు. కానీ తాము బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా హాజరు కాలేమని వారు స్పీకర్‌కు లేఖ రాశారు. మరోవైపు దేవదుర్గలో పూజలు చేసేందుకే వెళ్లానని, ఏ ఒక్క ఎమ్మెల్యేతోనూ చర్చించలేదని యడ్యూరప్ప చెప్పారు. కుమారస్వామి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుమారస్వామి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేనే లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచే వైదొలుగుతానని యడ్యూరప్ప సవాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *