మీరు ఏ పార్టీకి ఓటేశారంటూ.. ఏపీ ఓట‌ర్ల‌కు ఒక‌టే కాల్స్!

మీరు ఏ పార్టీకి ఓటేశారంటూ.. ఏపీ ఓట‌ర్ల‌కు ఒక‌టే కాల్స్!

ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసిన రోజు త‌ర్వాత నుంచి ఏపీ ఓట‌ర్ల‌కు అదే ప‌నిగా వ‌స్తున్న ఫోన్ కాల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత‌కీ వారికి వ‌స్తున్న ఫోన్ కాల్స్ సారాంశం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? అన్న ప్ర‌శ్న‌. దానికి జ‌వాబు చెప్పిన వెంట‌నే.. లోక్ స‌భ‌కు మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ఎన్నిక‌ల అభిప్రాయ సేక‌ర‌ణ పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌ర్వే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీ వ్యాప్తంగా గురువారం పోలింగ్ ముగిసిన‌ప్ప‌టికి.. ఈవీఎంల మొరాయింపుతో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఐదు గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ సాగిన వైనం తెలిసిందే.
పోలింగ్ పూర్తి అయిన రెండు రోజుల త‌ర్వాత నుంచి ఓట‌ర్ల‌కు అదే పనిగా ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. ఏ పార్టీకి మీరు ఓటేశార‌న్న విష‌యాన్నిక‌నుక్కునేందుకు వీలుగా ఐవీఆర్ ఎస్ కాల్స్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కాల్స్ కు స‌మాధానం చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌ని వారికి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఓటు స‌ర్వేకు స‌మాధానం చెప్ప‌టం ఇష్టం లేని వారు ఫోన్ క‌ట్ చేస్తే.. కాసేప‌టికే మ‌ళ్లీ ఫోన్లు వ‌స్తున్నాయి. దీంతో.. వారు స‌మాధానం చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇంత‌కీ.. ఈ స‌ర్వే ఎవ‌రు చేయిస్తున్నారు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స‌ర్వేలో మీరు ఏ పార్టీకి ఓటు వేశార‌న్న ప్ర‌శ్న త‌ర్వాత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక‌టి నెంబ‌రును ప్రెస్ చేయండి.. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రెండో నెంబ‌ర్ ను నొక్కండంటూ ప్రీరికార్డు వాయిస్ వినిపిస్తోంది. పోటాపోటీగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం.. ఊహించ‌ని రీతిలో ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు వెల్లువెత్తటం ఒక ఎత్తు అయితే.. ఓటు వేసేందుకు గంట‌ల త‌ర‌బ‌డి ఓపిగ్గా నిరీక్షించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ మారిన సంగ‌తి తెలిసిందే.

పోలింగ్ ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టానికి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర మ‌రో 40 రోజులు ప‌ట్టే నేప‌థ్యంలో.. అప్ప‌టికే ఒక క్లారిటీ తెచ్చుకోవ‌టానికి రాజ‌కీయ‌పార్టీలు ఏదైనా సంస్థ ద్వారా ఈ త‌ర‌హా స‌ర్వేలు చేయిస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు. ఓట‌ర్ల ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవ‌టానికి వీలుగా ఈ స‌ర్వేను చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏపీకి వెళ్లి ఓట్లు వేసి వ‌చ్చిన ప‌లువురు హైద‌రాబాదీయుల‌కు కూడా ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. ఇంత‌కీ.. ఈ స‌ర్వే చేయిస్తున్న‌ది ఎవ‌రన్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *