ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవి 5 ప్రసారాలు పునరుద్ధరించాలి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపల్లి

మీడియా గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం : రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపల్లి

  • ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవి 5 ప్రసారాలు పునరుద్ధరించాలి
  • రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపల్లి
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ర్యాలీ

మలికిపురం, సెప్టెంబర్ 17: ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యాఖ్యానించారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి 5 ఛానళ్ళపై ప్రభుత్వ ఆంక్షలకు నిరసనగా రాజోలు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మలికిపురంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, ఫూలే భవన్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన జర్నలిస్టులు ఊరేగింపుగా తహసిల్దారు కార్యాలయానికి వెళ్లి మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని తహసిల్దారు వివిఎల్ నరసింహరావుకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ జగన్ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడటం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలతో మొదలైన దాడి ఇప్పుడు మీడియా వరకూ వచ్చిందని చెప్పారు. చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోళ్ళ సతీష్ బాబు మాట్లాడుతూ పత్రికలు, ఛానెళ్లు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పత్రికలను, మీడియా సంస్థలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రాజోలు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ కాకి లక్ష్మణ్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ, మలికిపురం మండల టిడిపి అధ్యక్షుడు అడబాల యుగంధర్, కార్యదర్శి రాపాక నవరత్నం, ఆత్మ మాజీ ఛైర్మన్ అడబాల సాయిబాబు, టిడిపి నాయకులు పిండి సత్యనారాయణ, రుద్రరాజు శ్రీనివాసరాజు తదితరులు జర్నలిస్టుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు షర్కిల్, దొమ్మేటి శ్రీనివాస్, మొల్లేటి వెంకటేశ్వరరావు, కొండలరావు, గోపరాజు జవహర్లాల్, చెల్లుబోయిన మితేష్, పిల్లా వరప్రసాద్, రాపాక ప్రభుశేఖర్, కారుపల్లి శ్రీనివాస్, కుంపట్ల బాబి, గుబ్బల గౌతమి, సికిలే వెంకటేశ్వరరావు, ఆరేటి చంటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *