మిస్ట‌ర్ క్లీన్ టీడీపీలోకి...కాంగ్రెస్‌కు షాక్‌

మిస్ట‌ర్ క్లీన్ టీడీపీలోకి…కాంగ్రెస్‌కు షాక్‌

ఏపీ కాంగ్రెస్‌కు ఎన్నిక‌ల‌ వేళ మ‌రో షాక్ త‌గిలింది. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైరిశర్ల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కురుపాంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి రాజీనామాను ప్రకటించారు. 45 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశానని, పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వానికి, ఆదివాసీ జాతీయ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వ‌రలో ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 10వ తేదీన టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు సమ‌క్షంలోనే ఈ చేరిక ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

రాజీనామా అనంత‌రం కిశోర్ చంద్ర‌దేవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం కఠినమైన నిర్ణయమైనప్పటికీ ప్రస్తుత నాయకులకు విసుగెత్తి సరైన గుర్తింపు లేకపోవడంతో రాజీనామా చేశామన్నారు. రాహుల్‌గాంధీ కూటమి పార్టీని భూస్థాపితం చేసేందుకు పూనుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలోకూడా కాంగెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో లోపాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఎన్నికలలో ఓడిపోతానని తెలిసినా కేంద్రమంత్రిగా బాధ్యతతో కాంగ్రెస్ ద్వారా పోటీ చేశానన్నారు. తన రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, గత కొన్నాళ్లుగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానని, ప్రజలు ఆమోదిస్తారనే ఆశాభావం ఉందని కిశోర్ చంద్రదేవ్ పేర్కొన్నారు.

వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కిశోర్ పేర్కొన్నారు. ఢిల్లీలోగల బీజేపీయేతర పార్టీల నాయకులు శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, శరత్‌యాదవ్, మాయావతి, ఇతర మిత్రులు, బంధువులతో చర్చించి ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టానని, పూర్తిస్థాయిలో ఆలోచించుకున్నాకా ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటానని అన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ఎవరు ఒత్తిడి గాని, బేరసారాలు లేవన్నారు. బీజేపీని ఓడించేందుకు అవసరమైన పార్టీలో చేరతానన్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీకంటే ప్రాంతీయ పార్టీలు దేశాన్ని నడిపించే విధంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒకప్పుడు తాను ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మారాయని విశ్లేషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *